గుడికి వెళ్లగానే ముందుగా భక్తి విశ్వాసాలతో భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటాం. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తాం. స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించడాన్ని పుణ్యంగా భావిస్తూ ఉంటాం. అందుకే ఏ గుడికి వెళ్లినా తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా రాబోము. అయితే ప్రసాదం విషయాన్ని పక్కనబెడితే తీర్థం ఎందుకు తీసుకోవాలి? తీర్థాన్ని హస్త గోకర్ణ ముద్ర వేసి తీసుకుంటారు. ఈ ముద్ర ఎలా వేయాలి? ఈ ముద్రలో బొటనవేలు చూపుడు వేలుని నియంత్రిస్తూ ఉండగా చివరి మూడు వేళ్లను ముందుకు చాచడమే హస్త గోకర్ణ ముద్ర.
ఈ సందర్భంగా తీర్థాన్ని ఈ ముద్రలోనే తీసుకుంటే మంచిదని చెబుతుంటారు. ఇంట్లో అయినా.. దేవాలయంలో అయినా పూజ చేసిన తర్వాతే తీర్థాన్ని తీసుకోవాలి. ఇంట్లో అన్నం తిననప్పుడు మూడు సార్లు తీర్థం తీసుకోవాలి. గుడిలో అయితే ఒకసారి మాత్రమే తీర్థం తీసుకోవాలి. ఇక ఎవరైనా ఉపవాసం ఉంటే మాత్రం.. ఉదయం పూజానంతరం ఒకసారి.. సాయంత్రం ఉపవాసం తర్వాత సుర్యోదయం వేళ మరోసారి తీర్థం తీసుకోవాలి. అప్పుడే ఉపవాసం ముగుస్తుంది. ఇక ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతున్నప్పుడు మాత్రం తీర్థం తీసుకోకూడదు. తీర్థం తీసుకోవడం వల్ల అకస్మాత్తుగా మరణం సంభవించదు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం.. సకల పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం.