శ్రీశైలం మల్లన్న దేవస్థాన హుండీ ఆదాయం లెక్కించిన అధికారులు

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమే శ్రీశైలం. ఈ ఆలయాన్ని నిత్యం భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటూ ఉంటారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి కావడంతో ఇక్కడి శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనానికి దేశ వ్యాప్తంగా భారీ సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుంటూ ఉంటారు. తాజాగా శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలతో పాటు పరివార దేవాలయాల హుండీ లెక్కింపును ఆలయ సిబ్బంది చేపట్టింది. శ్రీశైలంలోని చంద్రవతి కల్యాణ మండపంలో లెక్కింపు నిర్వహించారు.

శ్రీశైలం మల్లన్న దేవస్థాన హుండీ ఆదాయం గడిచిన 27 రోజులలో రూ. 2 కోట్ల 81 లక్షల 51 వేల 743 వచ్చినట్టు ఆలయ ఈవో వెల్లడించారు. ఇక బంగారం, వెండి విషయానికి వస్తే.. 212 గ్రాముల 600 మిల్లీ గ్రాముల బంగారం, 3 కేజీల 770 గ్రాముల వెండిని భక్తులు సమర్పించారు. వివిధ దేశాల కరెన్సీ విషయానికి వస్తే. 644 యుఎస్ఏ డాలర్లు, 715- యూకే పౌండ్స్, 115 యుఏఈ దిర్హమ్స్, 56 మలేషియా రియాల్, 17 ఖత్తార్ రియాల్, 149 సౌది అరేబియా రియాల్స్, 20 యురోస్, 12 సింగపూర్ డాలర్లు, 20 కెనడ డాలర్లు,60 ఆస్ట్రేలియ డాలర్లు, 20 థాయ్లా ల్యాండ్భత్ వచ్చాయి. ఈ లెక్కింపులో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Share this post with your friends