ఛార్‌దామ్ యాత్రకు వేళైంది. అక్షయ తృతీయ శుభ సందర్భంగా ప్రముఖ పుణ్య క్షేత్రం కేదార్‌నాథ్ తలుపులు తెరుచుకున్నాయి. దీంతో పాటు గంగోత్రి, యమునోత్రి కూడా ప్రారంభమైంది. బద్రీనాథ్ మాత్రం తెరుచుకోవాల్సి ఉంది. ఇది కూడా మే 12న తెరుచుకోనుంది. హిందువులంతా తప్పనిసరిగా దర్శించుకోవాలనే ప్రదేశం కేదార్‌నాథ్. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుందీ ఆలయం. ఇది పరమేశ్వరుని భక్తులకు చాలా ఇష్టమైన ప్రదేశం. మే 10వ తేదీ శుక్రవారం అక్షయ తృతీయ శుభ సందర్భంగా.. భజనలు, ‘హర్ హర్ మహాదేవ్’ కీర్తనల మధ్య ఆలయ తలుపులను అధికారులు తెరిచారు.
కేదార్ర్‌నాథ్ తలుపులు తెరుచుకునే సమయంలో శివ నామ స్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది. చాపర్లతో పూల వర్షం కురిపించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్ నాథ్ అలయాన్ని సందర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కేదార్‌నాథ్ ఆలయం కూడా ఒకటి. ప్రతి యేటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి చార్‌దామ్ యాత్ర కోసం లక్షలాది మంది భక్తులు ఉత్తరాఖండ్‌కు తరలి వస్తుంటారు. శీతాకాలం రాగానే ఈ ఆలయాన్ని మూసివేస్తారు. దాదాపు ఆరు నెలల పాటు ఈ ఆలయాన్ని మూసివేసిన అనంతరం అక్షయ తృతీయ సందర్భంగా నేడు తెరిచారు.