సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజుగా మారడానికి కారణమేంటి?

సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఇవాళ భోళా శంకరుడిని భక్తిభావంతో పూజిస్తే కోరిన కోరికలు తప్పక నెరవేరుస్తాడని భక్తుల విశ్వాసం. ఎలాంటి సమస్యలున్నా కూడా శివుడు గట్టున పడేస్తాడట. అసలు సోమవారానికి, శివుడికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ప్రత్యేకంగా సోమవారమే స్వామివారు వరాల జల్లు కురిపిస్తాడా? అంటే దీని వెనుక చిన్న కథ ఉందని పురాణాలు చెబుతున్నాయి. సోమ్ అంటే చంద్రుడు అని అర్థం. చంద్రుడికి దక్షరాజు శాపం ఇచ్చారు. దాని నుంచి చంద్రుడిని శివుడే కాపాడాడు. కాబట్టి శివుడిని సోమనాథుడు అని కూడా పిలుస్తూ ఉంటారు.

అసలు చంద్రునికి దక్షుడు ఇచ్చిన శాపమేంటంటే.. ఏ వెలుగును చూసి నువ్వు విర్రవీగుతున్నావో ఆ వెలుగు క్రమక్రమంగా అంతరించుగాక అని శపించారు. బ్రహ్మ కుమారుడైన దక్షుడు శాపమిస్తే ఇక తిరుగేముంటుంది. చంద్రుడు క్రమక్రమంగా తన వెలుగును కోల్పోసాగాడు. అప్పుడు దేవతలు చాలా మందిని ఆశ్రయించాడు కానీ అంతా చేతులెచ్చేశారు. చివరకు భోళా శంకరుడిని ఆశ్రయించాడు. శంకరుడు లోకం ఎక్కడ చీకటై పోతుందోనని భయపడి.. అలాగే చంద్రుని ఆవేదనకు కరిగిపోయి. కొంతమేర శాప విమోచనం కల్పిస్తాడు. దీంతో చంద్రుడు.. శివుని శిరస్సులో చేరిపోయాడు. అప్పటి నుంచి శివుడు సోమనాధుడిగా కీర్తింపబడుతూ సోమవారం భక్తులను కనికరిస్తున్నాడు. అలాగని వేరే రోజుల్లో కనికరించడని కాదు కానీ శివుడికి సోమవారం ప్రీతికరంగా మారిపోయింది అంతే.

Share this post with your friends