హిందూ సంస్కృతీ, సంప్రదాయంలో భాగంగా మొక్కలు, చెట్లను పూజిస్తూ ఉంటాం. తులసి మొక్కను అయితే ఇంటి ముందు వేసుకుని నిత్యం పూజిస్తూ ఉంటాయి. అయితే ఇలా ఎందుకు పూజ చేస్తాం? అనేది చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. మిగిలిన వారంతా అందరినీ అనుసరించడమే తప్ప చెట్లను పూజించడం వెనుక కారణాలు అయితే తెలియదు. భగవంతుడు మానవ సంరక్షణ కోసం మొక్కలు, జంతువులను సృష్టించాడని హిందువుల నమ్మకం. మనలో జీవశక్తిగా కొలువై ఉన్నట్టే మొక్కలు, జంతువుల్లోనూ భగవంతుడు కొలువై ఉన్నాడని మన పూర్వీకులు నమ్మేవారు.
నాటి నుంచి మొక్కలను పూజించడం సంప్రదాయంగా మారిపోయింది. నిజానికి కూడా మన దైనందిన జీవితం మొత్తం చెట్లపైనే ఆధారపడి ఉంటుంది. మనిషికి కావల్సిన ఆక్సిజన్‌తో పాటు పండ్లు, ఔషధాలు.. చివరకు ఇంటి కలపగా కూడా మారతాయి. మన చుట్టూ ఉండే పరిసరాలను అందంగా మార్చడమే కాకుండా.. మనసుకు ప్రశాంతతను కల్పిస్తాయి. పురాతన గ్రంథాల ప్రకారం.. చెట్లను నరికేయడం వల్ల ‘శూనా’ అనే పాపం కలుగుతుందని పురాణాల్లో చెప్పడం జరిగింది. దానివల్లే జీవితంలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కుంటారని సైతం తెలిపాయి.అందువల్ల మన పూర్వీకులు మొక్కలు, చెట్లను అత్యంత భక్తిభావంతో పూజించేవారు.