వాతాపి అంటే ప్రాణాలను హరించేవాడని అర్థం.. అలాంటిది గణపతికి ఆ పేరెలా?

కర్ణాటక సంగీతంలో ‘వాతాపి గణపతిం భజే’ అంటూ సాగే ముత్తుస్వామి దీక్షితులవారి కృతి నిత్యం వింటూనే ఉంటాం. ఇంతకీ వాతాపి గణపతి గురించి తెలుసా? వాతాపి అంటే ప్రాణాలను హరించేవాడు. మరి గణేశునికి ఈ బిరుదేంటి? వాస్తవానికి యోగశాస్త్రం ప్రకారం మన శరీరంలోని మూలాధార చక్రానికి అధిపతి గణపతి. ఈ మూలాధారంలో ఎరుక మొదలైతే ఇహలోక వాంఛలు తగ్గిపోయి.. భవబంధాల పట్ల మోహం నశిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మనిషి జీవశ్చవంలా మారిపోయి శాశ్వతమైన ఆత్మ ప్రకాశించడం మొదలవుతుంది. అలాంటి స్థితిని సాధ్యం చేసేవాడు కాబట్టే గణపతికి వాతాపి అన్న పేరు వచ్చి ఉంటుంది.

ఇక వాతాపి పేరు వెనుక మరో కథ కూడా ఉంది. అప్పట్లో వాతాపి, ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వారు అరణ్యంలో సంచరిస్తూ ఎవరైనా మనిషి కనిపించగానే.. వారి వద్దకు ఇల్వలుడు బ్రాహ్మణ వేషంలో వెళ్లి తమ ఇంటికి వచ్చి అతిథి సత్కారాలను స్వీకరించమని కోరేవాడు. వాతాపి కామరూప విద్యతో మేకగా మారిపోయేవాడు. ఇల్వలుడు పిలవగానే వచ్చిన వారికి వాతాపిని ఇల్వలుడు వండి వడ్డించేవాడు. అతిథులు భోజనం చేయగానే.. సంజీవని మంత్రంతో ‘వాతాపీ బయటకు రా’ అనేవాడు ఇల్వలుడు. వెంటనే వాతాపి శరీరాన్ని చీల్చకుంటూ వచ్చేవాడు. ఒకసారి అగస్త్యముని వారి కంట పడ్డాడు. ఆయనను భోజనానికి ఆహ్వానించి వాతాపిని వండి వడ్డించాడు ఇల్వలుడు. విషయం తెలుసుకున్న అగస్త్యముని భోజనం చేయగానే.. జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనేశాడట. ఇక అంతే వాతాపి జీర్ణమై పోయాడు. కారణాలు ఏవైనా వాతాపి అన్న ప్రదేశంలో వెలిశాడు కాబట్టి గణపతిని వాతాపి గణపతి అని పిలుస్తారు.

Share this post with your friends