తిరుపతిలో గంగమ్మ జాతర చేయడం వెనుక కథేంటి?

తిరుపతిలో నిర్వహించే అతి పెద్ద జాతరలలో గంగమ్మ జాతర ఒకటి. అసలు గంగమ్మ జాతరను ఎందుకు నిర్వహిస్తారో తెలుసా? దీనికి ఓ కథ ఉంది. పూర్వం తిరుపతిని పాలెగాళ్లు పరిపాలించేవారు. అప్పట్లో ఒక పాలెగాడు రాజ్యంలోని అందమైన యువతులను బలాత్కరించేవాడట. కొత్తగా పెళ్లైన అమ్మాయిలు ముందుగా తనతో గడపాలని రూల్ పెట్టాడట. స్త్రీ జాతిని ఈ పాలెగాడి నుంచి రక్షించేందుకు జగన్మాతే గంగమ్మగా జన్మించిందని స్థానికుల నమ్మకం. తిరుపతికి 2 కి.మీ దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మ జన్మించిందని భక్తుల నమ్మకం. ఆమె జన్మించాక సదరు పాలెగాడు యథావిధిగా ఓ యుక్త వయసు కన్యను బలాత్కరించబోయాడట. అంతే గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందట. దీంతో పాలెగాడు పారిపోయి దాక్కున్నాడట.

ఆ పాలెగాడిని పట్టుకోవడం కోసం గంగమ్మ వివిధ వేషాలు ధరించి మూడు రోజుల పాటు వెదికినా దొరకక పోవడంతో నాలుగో రోజు దొరవేషం వేసిందట. దీంతో ఆ పాలెగాడు తమ దొర వచ్చాడనుకుని బయటకు రావడంతో అతడి తల నరికి గంగమ్మ సంహరించిందట. ఆ దుష్ట శిక్షణకు తలచుకుంటే గంగమ్మ తల్లి తమను ఎప్పుడూ రక్షించాలని ఏటా ప్రజలు గంగమ్మ జాతరను నిర్వహిస్తారు. ఈ జాతరలో పాలెగాడిని పట్టుకునేందుకు గంగమ్మ వేషాలు వేసినట్టు భక్తులు కూడా వివిధ వేషాలు ధరిస్తూ ఉంటారు. మొదటి రోజు బైరాగి వేషం.. రెండో రోజు బండ వేషం.. మూడో రోజు తోటి వేషి.. నాలుగో రోజు దొర వేషం వేస్తారు. ఈ జాతర అన్ని రోజులూ తిరుపతిలో సందడే సందడి.

Share this post with your friends