జైన ఋషులు, సాధ్విలు స్నానం చేయరు.. అయినా వారు స్వచ్ఛంగానే ఉంటారు.. కారణమేంటంటే..

జైనమతంలో ఓ ఆసక్తికరమైన ఆచారం ఉంటుంది. ఇది అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. ఈ మతంలో ఋషులు, సాధ్వి జీవితాన్ని గడిపే విధానం అత్యంత క్రమశిక్షణతో కూడి ఉంటుంది. అయితే వారు దీక్ష తీసుకున్నప్పటి నుంచి స్నానం చేయరు. అయినా సరే.. ఎప్పుడూ కూడా చాలా నీట్‌గా కనిపిస్తారు. ఎందుకు స్నానం చేయరు? చేయకున్నా నీట్‌గా కనిపించడానికి కారణమేంటో చూద్దాం. జైనమతంలో శ్వేతాంబర, దిగంబర అనే రెండు శాఖలున్నాయి. ఈ దీక్ష తీసుకున్న వారు క్రమశిక్షణతోనూ.. గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వీరు ఇష్టానుసారంగా వస్త్ర ధారణ కూడా చేయరు.

శ్వేతాంబర సాధువులు, సాధ్విలు తమ శరీరంపై సన్నని కాటన్ వస్త్రాన్ని మాత్రమే ధరిస్తారు. ఇక దిగంబర సాధువులైతే దుస్తులు కూడా ధరించరు. సాధ్విలు మాత్రం తెల్లటి వస్త్రాన్ని చీరగా ధరిస్తారు. విపరీతమైన చలి ఉన్నా.. గడ్డ కట్టే మంచు ఉన్నా సరే.. శ్వేతాంబరలు కానీ దిగంబర సాధువులు కానీ తమ నియమాలను అతిక్రమించరు. సీజన్ ఏదైనా సరే.. నేలపై మాత్రమే నిద్రిస్తారు. ఒక్కటే ఒక్క దుప్పటి వాడుతారు. అది కూడా చాలా పలుచగా ఉంటుంది. అయితే చలికాలంలో చాప లేదా ఎండుగడ్డిని నేలపై పరుచుకోవచ్చు. ఇలా కూడా చాలా అరుదుగానే చేస్తారు. వీరు బాహ్య స్నానం చేయరు. అంతర్గత స్నానం మాత్రమే చేస్తారు. అంతర్గత స్నానమంటే ధ్యానంలో కూర్చొని తమ ఆలోచనలను శుద్ధి చేసుకుంటారట. సాధువులు, సాధ్విలు తడిగుడ్డతో శరీరాన్ని తుడుచుకుంటారు. దీనివల్లనే వారి శరీరం నిత్యం స్వచ్ఛంగా కనిపిస్తుంది.

Share this post with your friends