నక్కలకు ఆహారం అందించే ఆలయం కూకడా ఒకటుంది. దీని గురించి తెలుసుకుని తీరాల్సింది. గుజరాత్‌లోని కచ్ జిల్లా ఉంది. కచ్‌కు 90 కిలోమీటర్ల దూరంలో కాలో దుంగార్ అనే పర్వతం ఉంది. నల్లగా ఉంటుంది కాబట్టి ఈ పర్వతానికి ఈ పేరు వచ్చింది. ఈ పర్వతం 15 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది ఎక్కితే పాకిస్తాన్ భూభాగం కూడా కనిపిస్తుంది. కాలో దుంగార్‌పై దత్తాత్రేయుని ఆలయం ఉంది. ఆలయం చిన్నదే అయినా చరిత్ర మాత్రం పెద్దదే. ఒకానొక సమయంలో దత్తాత్రేయుల వారు పర్వతాల మధ్యన సంచరిస్తుండగా.. ఆయన దగ్గరకు కొన్ని నక్కలు ఆహారం కోసం వచ్చాయట. వాటి ఆకలి తీర్చేందుకు ఆయన వద్ద ఆహారం లేకపోవడంతో ‘లే అంగ్’ అంటూ తన చేతినే వాటికి ఆహారంగా ఇచ్చారట.
ఇక ఈ ఆలయం గురించి మరో కథ కూడా ఉంది. దత్తాత్రేయుని దర్శనం కోసం ఒక రాజు ఘోర తపస్సును ఆచరిస్తుండగా.. దానిని పరీక్షించేందుకు దత్తాత్రేయుల వారు ఒక నక్క రూపంలో రాజు దగ్గరకు వచ్చారట. తన ఆకలి తీర్చమని రాజును అడగ్గా దాని ముందు రుచికరమైన భోజనాన్ని ఉంచారట. తాను మాంసాన్ని ఇష్టపడనని నక్క చెప్పడంతో రాజు స్వయంగా తన చేతిని నరికి నక్క ముందు ఉంచారట. రాజు దానగుణానికి దత్తాత్రేయులవారు సంతోషించారట. కథలెన్ని ప్రచారంలో ఉన్నా కూడా చాలా కాలంగా నక్కలకు ఆహారాన్ని ఇవ్వడం మాత్రం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. ఆలయం వద్ద సాయంకాలం పూజారి అరుగు దగ్గరకు వచ్చి అక్కడున్న పళ్లెంపై కొడుతూ ‘లే అంగ్’ అని అరుస్తారు. వెంటనే నక్కలన్నీ అక్కడకు క్యూ కడతాయట. అరుగుపై పూజారి పెట్టిన ఆహారాన్ని ఆవురావురుమంటూ తినేస్తాయి.