హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో కొలువైన పెద్దమ్మ తల్లి ఆలయం గురించి తెలియని వారుండరు. ఈ అమ్మవారి ఆలయానికి జంట నగరాల నుంచే కాకుండా సిటీకి వచ్చిన వారంతా సమయం ఉంటే పక్కాగా అమ్మవారిని దర్శించుకుని వెళతారు. అమ్మవారిని భక్తితో మొక్కాలే కానీ కోరుకున్నది ఏదైనా జరుగుతుందని నమ్మకం. హైదరాబాద్‌లోని పురాతన ఆలయాల్లో ఇది కూడా ఒకటి. దివంగత మాజీ మంత్రి పి. జనార్థనరెడ్డి ఈ ఆలయాన్ని పునర్మించారు. ఈ ఆలయం గురించి చాలా మందికి తెలియని విశేషాలు ఎన్నో ఉన్నాయి. ఆలయంలోని అమ్మవారిని దర్శించుకుని వచ్చే వారు కొన్ని విషయాలను పెద్దగా గమనించరు.
ఈ ఆలయ సముదాయంలో ఐదు అంతస్తుల గర్భగుడి ఉంటుంది. అలాగే ఏడు అంతస్తుల రాజగోపురం, కళ్యాణమండపం, వసతి గృహాలు ఉన్నాయి. అన్ని ఆలయాల్లో మాదిరిగానే ఇక్కడ కూడా ఎత్తైన ధ్వజస్తంభం ఉంది. ఇక్కడి ధ్వజస్తంభం దగ్గర రూపాయి బిళ్ల పడిపోకుండా నిలబడితే మన మనసులోని కోరిక పక్కా నెరవేరుతుందట. 1984లో హంపి విరూపాక్ష పీఠాధిపతులు నూతన విగ్రప్రతిష్ఠాపన చేశారు. అప్పటి నుంచి మొదలు ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. అప్పట్లో పెద్దమ్మ తల్లి గ్రామ దేవతగా పూజలు అందుకుంటూ ఉండేదట. హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందడంతో పల్లె వాసాలు పోయి ఈ ఆలయం సిటీలో భాగమైపోయింది. అప్పట్లో ఈ అమ్మవారిని ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతిష్టించారట.