మన పురాణాల్లో ఏ దేవుడిని ఏ రోజు పూజించాలో చెప్పారు. ఆ ప్రకారమే మనం దేవుళ్లకు పూజలు నిర్వహిస్తూ ఉంటాం. ఆదివారం సూర్యునికి, సోమవారం శివునికి, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయుడికి ఇష్టమైన రోజులు. ఇలా ప్రతి ఒక్క దేవుడికి ఒక రోజు ఉంది. అలాగే మన వేంకటేశ్వర స్వామికి కూడా ఒక రోజు ఉంది. అదే శనివారం. అసలు శనివారమంటే స్వామివారికి ఎందుకంత ఇష్టం? అంటే దీనికి కారణం లేకపోలేదు. వేంకటేశ్వరుని పెళ్లి నుంచి ప్రతిదీ శనివారమే జరిగాయట. అందుకే శ్రీనివాసునికి శనివారమంటే అంత ఇష్టమట. ఈ రోజున స్వామివారికి పూజలు నిర్వహిస్తే శని బాధల నుంచి విముక్తి లభిస్తుందట.
శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్నది శనివారమేనట.. ఓంకారం ప్రభవించిన రోజు.. వేంకటేశ్వర స్వామి తనకు ఆలయాన్ని నిర్మించమని తొండమాన్ చక్రవర్తిని ఆదేశించిన రోజు.. స్వామివారు ఆలయ ప్రవేశం చేసింది అంతా శనివారమేనట. శ్రీనివాసునికి ఎంతో ఇష్టమైన చక్రత్తాళ్వార్ అని పిలిచే సుదర్శన చక్రం పుట్టింది కూడా శనివారమేనట. అందుకే స్వామివారికి శనివారం చాలా ఇష్టమని చెబుతుంటారు. శనివారం రోజున వేంకటేశ్వరస్వామికి పూజలు చేస్తే అప్పుల బాధలు ఉండవట. అనుకోని అవాంతరాలు సైతం తొలిగి జీవితం ప్రశాంతంగా మారుతుందని పండితులు చెబుతారు.