ఎలాంటి సంకట స్థితిలో ఉన్న మనల్ని గట్టున పడేస్తాడట ఆంజనేయ స్వామి. అందుకే ఆయనను సంకటమోచనుడని అంటారు. ఆయన జయంతిని ఏప్రిల్ 23న యావత్ భారత దేశం జరుపుకోనుంది. హనుమంతుడు చైత్ర మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి నాడు జయించాడు. ఈ చైత్ర మాసంలో శుక్లపక్ష పౌర్ణమి ఏప్రిల్ 23 వ తేదీన రానుంది. కాబట్టి ఈ రోజునే హనుమంతుడి జయంతిని భక్తులు జరుపుకోనున్నారు. ఈ రోజు ఉదయం స్వామివారి పూజకు 9.03 గంటల నుంచి 10.41 గంటల వరకూ అనుకూలంగా ఉంది కాబట్టి ఈ సమయంలో పూజ నిర్వహించుకోవడం చాలా మంచిదట.
హనుమంతుడి పూజా విధానం కూడా కీలకమైనదే. ఏ పూజ అయినా చేసే విధంగా చేస్తేనే సత్ఫలితాలు ఉంటాయి. ఇక హనుమంతుడి ఆశీర్వాదం లభించి మనం అనుకున్నది నెరవేరాలంటే సరైన పూజా విధానం తప్పనిసరి. కాబట్టి స్వామివారి పూజలో కొన్ని ముఖ్యమైన విషయాలను చేర్చుకోవాలి. ఆంజనేయుడి ఆరాధనలో ముఖ్యంగా సింధూరం రంగను చేర్చుకోవాలి. ఈ రంగు అంటే స్వామివారికి చాలా ఇష్టం. అలాగే హనుమంతుని పూజలో ఎరుపు రంగు పువ్వులు, ఎర్రటి పండ్లు, సింధూరంతో పాటు పూజ చేసేవారు ఎరుపు లేదా నారింజ రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది.