మే 17న ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో సీతా జ‌యంతి

ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో మే 17వ తేదీ శుక్ర‌వారం సీతా జ‌యంతి ఉత్స‌వాలు వైభ‌వంగా నిర్వ‌హించ‌నున్నారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం మూలవర్లకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చన చేస్తారు. ఇందులో భాగంగా సాయంత్రం 5 నుండి 6 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలోని రంగ మండ‌పంలో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను వేంచేపు చేస్తారు. అనంత‌రం విష్వక్సేన పూజ, వాసుదేవ పుణ్యాహవచనం, ఆరాధ‌న, నిర్వ‌హిస్తారు. ప్ర‌త్యేకంగా సీత‌మ్మ‌వారికి “వాసంతిక పూజ” మ‌ల్లె పూల‌తో స‌హ‌స్ర‌నామ అర్చ‌న శాస్త్రోక్తంగా నిర్వ‌హించ‌నున్నారు.

ప్రాశ‌స్త్యం :
శ్రీ రామ‌చంద్ర‌మూర్తి చైత్ర‌మాసం శుక్ల‌ప‌క్షం న‌వ‌మినాడు జ‌న్మించారు. ఒక నెల త‌రువాత శ్రీమహాలక్ష్మి అవతారమైన సీతాదేవి వైశాఖ మాసం శుక్ల‌ప‌క్షం న‌వ‌మినాడు అవిర్భ‌వించారు. జ‌న‌క మ‌హారాజు యాగము చేయుచూ భూమిని దున్నుచుండగా నాగలికి ఒక పెట్టెలో పసిపిల్లగా సీత‌మ్మ‌వారు అవిర్భ‌వించారు. ఆల‌యంలో ల‌భించిన శాస‌నాల ద్వారా 11వ శ‌తాబ్ధం నుండి ఈ ప‌ర్వ‌దినాన సీతా జ‌యంతి నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌ని అర్చ‌కులు తెలిపారు.

Share this post with your friends