శ్రీశైలం వెళుతున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి..

దేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటి శ్రీశైలం. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో ఉంది. ఇక్కడ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకుంటే జీవితంలో అంతా మంచి జరుగుతుందని భావిస్తూ ఉంటారు. ఇక్కడికి వెళ్లాలనుకునే వారు ఇప్పుడైతే పక్కాగా ఒక విషయం తెలిసుకుని వెళ్లాలి. అదేంటంటే.. ఇక్కడ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. ఈ మేరకు ఆలయ ఈవో పెద్దిరాజు, ఇతర ఆలయ అధికారులు ప్రకటించారు. శ్రీశైలం దేవస్థానం ఈవో పెద్దిరాజు శ్రీశైలం మహాక్షేత్రాన్ని ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. నిర్ణయం తీసుకున్న వెంటనే ఈవో పారిశుద్య కార్మికులకు సైతం ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ బాటిళ్ళను లేకుండా చేసి శుభ్రపరిచారు.

క్షేత్ర పరిధిలోకి ప్లాస్టిక్‌ను తీసుకురాకుండా వాహనాల తనిఖీని సైతం ఆలయం చేపట్టింది. భక్తులకే కాకుండా స్థానిక వ్యాపారులందరికీ ప్లాస్టిక్ కవర్ల స్థానంలో క్లాత్ కవర్స్, జ్యూట్ బ్యాగులు వినియోగించుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇక వాటర్ బాటిళ్లను సైతం వినియోగించడానికి లేదని.. వాటి స్థానంలో మట్టి, స్టీలు లేదంటే రాగి బాటిట్స్‌ని వినియోగించాలని సూచించారు. శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఎక్కడికక్కడ ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ నిషేధంపై దేవస్థానానికి పూర్తి స్థాయిలో సహకరించాలని భక్తులతో పాటు స్థానికులు, వ్యాపారులు తదితరులందరినీ ఈవో పెద్దిరాజు కోరారు.

Share this post with your friends