హిందూ పురాణాలలో విష్ణుమూర్తికి ఉన్న ప్రాశస్త్యం అంతా ఇంతా కాదు. శ్రీమహావిష్ణువుకి 24 పేర్లున్నాయి. వీటినే కేశవ నామాలు అంటారు. కాలచక్రంలో రోజుకు 24 గంటల మాదిరిగా కేశవ నామాలు కూడా 24 ఉంటాయి. ఇక కేశవలో- క = బ్రహ్మ, అ= విష్ణువు, ఈశ= రుద్రుడు. సృష్టి, స్థితి, లయ కారకుడు. బ్రహ్మ రుద్రులకు ప్రవర్తకుడూ, నియామకుడూ అయినందు వల్ల శ్రీహరి ‘కేశవుడు’అని పిలవబడుతున్నాడు.మనము ఏ శుభకార్యం చేయాలన్నా, ఏ వ్రతము, ఏ నోము నోయాలన్నా, ఏ యజ్ఞము చేయాలన్నా సంకల్పానికి ముంచుగా ఆచమనం చేస్తూ ఉంటాం. అప్పుడు ఓం కేశవాయనమః, నారాయణాయనమః, మాధవాయనమః అని ఉద్ధరణితో నీళ్లు తీసుకుని వదులుతారు.
కేశవ నామాలలో మొదటి నామం అయిన కేశవ రూపంలో స్వామి వారికి కుడివైపు ఉన్న రెండు చేతులతో పద్మము, శంఖము… ఎడమ వైపు ఉన్న రెండు చేతులతో గద, చక్రం పట్టుకుని కనిపిస్తాడు. ఇక మాధవ రూపంలో కుడివైపు రెండు చేతులతో గద, చక్రం పట్టుకుని ఉంటాడు. ఎడమవైపు చేతుల్లో పద్మము, శంఖము ఉంటుంది. మధుసూధన రూపంలో కుడివైపు చేతులతో చక్రం, శంఖము.. ఎడమవైపు చేతులతో గద, పద్మము పట్టుకుని ఉంటాడు. ఆసక్తికర విషయం ఏంటంటే.. విష్ణుమూర్తి ప్రతి పదిహేను రోజులకోసారి అంగీ పౌర్ణమికి, అమావాస్య కు తన ఆయుధాలను చేతులు మార్చుకుంటూ ఉంటాడు.
కేశవ నామాలు: కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూధన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషీకేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, అనిరుధ్ధ, ప్రద్యుమ్న, పురుషోత్తమ, అధోక్షజ, నారసింహ, అచ్యుత, జనార్ధన, ఉపేంద్ర, హరి శ్రీకృష్ణ.