సంప్రోక్షణంతో ఈ పవిత్రోత్సవానికి ఏమైనా పోలిక ఉందా?

ఆలయాల్లో పవిత్రోత్సవం ఏడాదికొక పర్యాయం ఆలయపవిత్ర వాతావరణం పునఃస్థాపితమయ్యేందుకు జరుగుతుందని చెప్పుకున్నాం కదా… ఐతే ఇది బ్రహ్మోత్సవాది సందర్భాల్లో, అంతకు ముందు బలిపీఠాల వద్ద, మూలబేరం వద్ద జనసమ్మర్దం వల్ల ఏర్పడిన కాలుష్యాన్ని పోగొట్టేందుకు జరిపే సంప్రోక్షణం కన్నా భిన్నమైంది. దానికి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అని పేరు. పవిత్రోత్సవంలో మంత్ర, వేద, పురాణపారాయణాది కార్యక్రమాల ద్వారా భగవానుడే లేదా మూలమూర్తే విద్యుదుత్పాదక యంత్రంగా పనిచేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో తిరుమల వేంకటేశ్వర స్వామివారి వార్షిక పవిత్రోత్సవం వైభవోపేతంగా జరుగుతుంది.

ఈ రోజుల్లో శ్రీవేంకటేశ్వర స్వామి, ఆయన దేవేరులతో పాటు ఉత్సవ విగ్రహాలు ఆలయ కల్యాణ మండపంలోని యాగశాల్లో ఉంచబడి ఉత్సవానంతరం పూర్ణాహుతి అయిన తర్వాత మరల ఆలయప్రవేశం గావించబడతాయి. ఈ దినాల్లో శాస్త్రోక్తంగా హోమాది కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. మొదటిరోజున పట్టుపోగులతో తులసిపూసలు లేదా తామరతూడు సరంలా కనిపించే పవిత్రాలను యాగశాలలో ఉంచుతారు. రెండవరోజున శాస్త్రోక్త మర్యాదలతో ఈ పవిత్రములను శ్రీవారి ఆలయానికి, బేడీ ఆంజనేయస్వామి ఆలయానికి నడుమగల ప్రధాన ఇతర పరివారదేవతలకు సమర్పించటం జరుగుతుంది. మూడవరోజున పవిత్ర విసర్జనం జరుపబడి పూర్ణాహుతితో ఉత్సవం సమాప్తమవుతుంది.

Share this post with your friends