ప్రాచీన గ్రంధాలలో పంచాంగం గురించి వివరించడం జరిగింది.
తిథిః వారంచ నక్షత్రం యోగః కరణమేవ చ పంచాంగమితి విఖ్యాతం కాలోయం కర్మసాధకః
తిథి వార నక్షత్ర, యోగ కరణములనునవి పంచాంగములు. ఈ పంచాంగములు మానవులకు వారి వారి జాతకరీత్యా ఫలితాలను తెలుపుతూ ఉంటాయి. ఈ పంచాంగాల ఫలం కూడా ఇలా చెప్పబడింది .

తిథేశ్చశ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం
నక్షత్రాధర్హతే పాపం యోగాద్రోగ నివారణం
కరణాత్కార్య సిద్ధిస్తు పంచాంగఫల ముత్తమం
కాలవిత్కర్మకృద్ధీమాన్ దేవతానుగ్రహం లభేత్
తిథి సంపదలను, వారం ఆయుష్షును ఇస్తాయి. నక్షత్రం పాపాన్ని హరిస్తుంది. యోగం రోగనివారకం. ఖరనం కార్యసిద్ధిని కలుగజేస్తుంది. ఇదే ఉత్తమమైన పంచాంగ ఫలం, కాలాన్ని ఎరిగి కర్మనాచరించే బుద్ధిమంతుడు దేవతానుగ్రహాన్ని పొందుతాడు.
దీనిలో పై ఐదు అంగాలతో పాటు రవ్యాదుల స్థిత్యాది విశేషాలున్నాయి. పంచాంగం నందు తిథ్యాదులు ఎన్ని గంటల వరకు ఉంటాయో ప్రతి దినమునకు రాస్తారు. ఆ దినమునకు చెందిన సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలు, ఇంగ్లీష్ తేదీలు, శాలివాహక శకం తేదీలు, ఆ రోజున సంచరించే గ్రహాల పేర్లు ఉంటాయి. తిథి, వార, నక్షత్ర, యోగా, కరణం అనేవి వరుసగా రాయబడి ఉంటాయి. ఆయనం, ఋతువు, ఇంగ్లీష్ తేదీల పక్కన ఇంగ్లీష్ నెల, సంవత్సరం రాయబడతాయి. తిథి, నక్షత్రాల తరువాత అవి ఆ దినం ఎంత వరకు ఉంటాయో ఆ కాలాన్ని రాస్తారు. దుర్ముహూర్త ప్రారంభ సమయము ఇచ్చి ఎంత కాలము త్యాజ్యమో కూడా రాస్తారు. ఆ నెల ప్రారంభములో గ్రహస్థితిని తెలిపే చక్రం ఉంటుంది. లగ్నాంత కాలములు పగటికి రాత్రికి చెందినవి ఉంటాయి. సుముహూర్తాలు, గ్రహణాలు, మూఢములు మొదలగునవి సూచించబడతాయి.
