తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫల పుష్ప అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందుకోసం 10 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 60 వేల కట్ ఫ్లవర్స్ ఉపయోగించారు. శ్రీవారి ఆలయం లోపల ఆపిల్, ద్రాక్ష, బత్తాయి, నారింజ, కర్బూజ, మామిడి, చెరకు వంటి విభిన్న రకాల పండ్ల గుత్తులు, అపురూపమైన ఉత్తమజాతి పుష్పాలతో భూలోక వైకుంఠంగా శ్రీవారి ఆలయాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు. శ్రీవారి ఆలయంలో ధ్వజస్థంభం చెంత పుచ్చకాయలతో చెక్కిన దశావతారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదేవిధంగా అయోధ్య రామాలయం, బాల రాముడి సెట్టింగ్, నవధాన్యాలతో రూపొందించిన మత్స అవతారము భక్తులను మైమరిపించింది.
ఆలయం వెలుపల గొల్ల మండపం పక్కన త్రేతా, ద్వాపర, కలియుగాలకు సంబంధించిన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ వేదనారాయణ స్వామి, శ్రీమహావిష్ణువు దశావతారాలు, ఉద్యానవనంలో ఆడుకుంటున్న రామలక్ష్మణుల సమేత హనుమంతుల వారు, బాల కృష్ణుడు వంటి పౌరాణిక ఘట్టాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆలయం బయట భక్తులు తమ చరవాణుల్లో ఫలపుష్ప ఆకృతులతో ఫొటోలు దిగుతూ ఉల్లాసంగా గడిపారు. టీటీడీ గార్డెన్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 150 మంది పుష్పాలంకరణ కళాకారులు, టీటీడీ గార్డెన్ సిబ్బంది 100 మంది రెండు రోజుల పాటు శ్రమించి ఆకర్షణీయమైన ఫల – పుష్ప ఆకృతులను రూపొందించారు.