తమిళనాడు రాష్ట్రంలోని నాగర్ కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం ఉంది. ముందుగా చెప్పుకున్నట్టు ఈ ఆలయంలో వినాయకుడు, బావి రంగు మార్చుకోవడమే విశేషాలు కావు. ఇంకా చాలా విశేషాలున్నాయి. సాధారణంగా శిశిర ఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి సహజం. కానీ ఆసక్తికరంగా ఇక్కడ చెట్లన్నీ అన్ని కాలాల్లోనూ పచ్చగానే ఉంటాయి. దీనికి కారణం.. దట్టమైన అడవులే. ఈ కారణంగానే తమిళ, కేరళ అరణ్య ప్రాంతాలకు ఋతు భేదమనేది వర్తించదు. అయితే ఈ ఆలయంలో ఉన్న మఱ్ఱిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది.

వాస్తవానికి ఇదొక విచిత్రమే. ఇలా ఎందుకు జరుగుతుందనేది అతి పెద్ద మిరాకిల్. అందుకే ఈ ఆలయాన్ని ‘మిరాకిల్ వినాయకర్ ఆలయం’ అని కూడా పిలుస్తారు. ఇన్ని వింతలున్న ఈ ఆలయ చరిత్ర ఏంటో తెలుసుకుందాం. ఈ ఆలయానికి 2300 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని 1317 సంవత్సరంలో నిర్మించినట్లుగా ఆలయ చరిత్ర చెబుతోంది. కానీ కొందరు మాత్రం.. 12 వ శతాబ్దంలోనే ఈ ఆలయం ఉందని, తొలుత ఇది శివాలయంగా ఉండేదని అంటున్నారు. ఆలయ ప్రాంగణంలో శివాలయం దర్శనమివ్వడం కూడా ఇందుకు నిదర్శనంగా పేర్కొంటారు. ప్రారంభంలో శివాలయం ఉండడం వల్లే ఈ ఆలయానికి శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయమని పేరు వచ్చిందని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.
