తమిళనాడు రాష్ట్రంలోని నాగర్ కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం ఉంది. ఈ క్షేత్రంలోని వినాయకుడు ఏడాదికి రెండు సార్లు రంగులు మారుస్తూ ఉంటాడు. శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయంలోని మూలవిరాట్ అయిన వినాయకుడు ఆరు నెలలకు ఒకసారి తన రంగు తానే మార్చుకోవడం అనేది అద్భుతం. దేవతలకు పగలుగా భావించే ఉత్తరాయణ పుణ్య కాలంలో అంటే మార్చి నుంచి జూన్ వరకూ.. తిరిగి దేవతలకు రాత్రిగా భావించే దక్షిణాయన పుణ్యకాలంలో అంటే జూలై నుంచి ఫిబ్రవరి వరకూ మరో రంగులో ఉంటాడు. ఉత్తరాయణంలో నల్లగానూ.. దక్షిణాయనంలో తెల్లని రంగులో ఉంటాడు.

అసలు వినాయకుడు ఈ విధంగా ఎందుకు రంగులు మారుస్తాడనేది ఎవరికీ అంతుబట్టదు. రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని మాహాత్మ్యం అని భక్తులు భావిస్తూ ఉంటారు.
ఈ విశిష్టమైన గణపతి ఆలయంలో మరో విచిత్రం కూడా ఉంది. అదేంటంటే.. ఈ ఆలయం ఆవరణలో ఓ మంచినీటి బావి. సాధారణంగా ఎక్కడైనా నీటికి రంగు ఉండదు. కానీ ఇక్కడ ఉన్న వినాయకుడి మాదిరిగానే బావిలోని నీరు కూడా రంగును మార్చకుంటాయి. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ విచిత్రం వినాయకునికి వ్యతిరేకంగా జరగడం మరో వింతగా పేర్కొంటారు. వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో ఈ బావిలో నీళ్లు తెల్లగానూ.. వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో బావి నీరు నల్లగానూ ఉంటాయి.
