తమిళనాడులో ఎక్కువగా సుబ్రహ్మణ్యస్వామితో పాటు వినాయకుడిని ఆరాధిస్తూ ఉంటారు. గణపతికి నమస్కరించకుండా ఏ పనిని హిందువులంతా మొదలుపెట్టబోము. ఈ క్రమంలోనే గణపతి సైతం సాధారణంగా ఎన్నో రూపాల్లో మనకు దర్శనమిస్తూ ఉంటాడు. అయితే ఎక్కడైనా గణపతి ఏదో ఒక రూపంలో మాత్రమే మనకు కనిపిస్తాడు. కానీ ఒకచోట మాత్రం రంగులు మార్చుకునే గణపతిని చూడవచ్చు. ఇంతకు ముందు రంగులు మార్చుకునే శివలింగం గురించి విన్నాం కానీ.. గణపతి గురించి మాత్రం వినలేదు కదా. మరి రంగులు మార్చుకునే వినాయకుడు ఎక్కడ కొలువుదీరాడో తెలుసుకుందాం.

తమిళనాడులో ఈ మిరాకిల్ వినాయకుడు కొలువుదీరాడు. తమిళనాడు రాష్ట్రంలోని నాగర్ కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం ఉంది. ఈ ఆలయం చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది. కానీ ఈ ఆలయంలో కొలువుదీరిన వినాయకుడి మహిమలు మాత్రం అనంతమని చెబుతారు. ఇక్కడ స్వామిని కొంగు చాచి అడిగితే తీరని కోరికంటూ ఉండదని భక్తుల విశ్వాసం. ఇక్కడ వినాయకుడి విగ్రహం రంగులు మార్చుతూ ఉంటుంది. ఇలా ఎప్పుడో ఒకసారి కాదు.. ఆరు నెలలకు ఒకసారి తనే రంగులు మార్చుతూ ఉంటుంది. మార్చి, జూన్ నెలల్లో ఇలా రంగులు మార్చుతూ ఉంటుంది.
