హిందువుల దశాబ్దాల కల నెరవేరింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది. బాలరామయ్య అట్టహాసంగా కొలువు తీరాడు. తాజాగా బాలరామయ్యపై భక్తితో వెండి విల్లు, బాణాన్ని కొందరు భక్తులు తయారు చేయించారు. అవి ఇప్పటికే అయోధ్య రామయ్య చెంతకు చేరేందుకు సిద్ధమయ్యాయి. బెంగుళూరుకు చెందిన కొందరు భక్తులు రామయ్యపై అత్యంత భక్తిభావంతో ఏదైనా స్వామివారికి కానుకగా అందజేయాలనుకున్నారు. ఈ క్రమంలోనే స్వామివారి కోసం అందంగా బాణం, విల్లును తయారు చేసి శృంగేరి పీఠానికి అందజేశారు.
వెండి విల్లు, బాణాన్ని ఈ రోజు శృంగేరి పీఠానికి చెందిన స్వామీజీ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఆపై అయోధ్యకు పంపబడుతుంది. శృంగేరి సీనియర్ శ్రీ భారతీ తీర్థ మహాస్వామీజీ పూజలు నిర్వహించగా జూనియర్ గురువు మిధుశేఖర శ్రీ చేతుల మీదుగా వెండి బాణానికి పూజాదికార్యక్రమాలను నిర్వహించారు. ఇప్పటికే బాల రామయ్య కోసం కొందరు భక్తులు బంగారు బాణాలు, విల్లులు, కిరీటాలు, బంగారం, వెండి పాదరక్షలు వంటి ఎన్నో కానుకలను అందజేశారు. ఏపీకి చెందిన చల్లా శ్రీనివాస్ అనే భక్తుడు సైతం అయోధ్య బాల రామయ్యకు వెండి విల్లును సమర్పించారు.