కుంతీ పుత్రుడైన కర్ణుడు విలువిద్యలో ఆరితేరినవాడు. అర్జనుడి కంటే ప్రతిభావంతుడు. అయినా సరే.. కృష్ణార్జనుల చేతిలో మరణించాడు. అసలు గత జన్మలో ఎవరీ కృష్ణార్జనులు? ఎందుకు కర్ణుడిని చంపాల్సి వచ్చింది? అంటే సహస్ర కవచుడి గురించి మనం ఇప్పటికే చెప్పుకున్నాం. దేవతలను హింసించగా.. వారు వెళ్లి శ్రీహరికి మొరపెట్టుకోవడంతో తాను నరనాయణునిగా జన్మించి సహస్ర కవచుడిని చంపేస్తామని చెబుతారు. ఈ క్రమంలోనే నరనారాయణులకు సహస్ర కవచుడికి మధ్య వెయ్యేళ్ల పాటు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో సహస్ర కవచుడు తనకున్న 999 కవచాలను కోల్పోతాడు.
ఆ ఒక్క కవచం కూడా కోల్పోతే ఇక తను బతకనని సూర్యుని చెంతన చేరి ఆశ్రయం పొందుతాడు. తానైతే రక్షించలేనని సూర్యుడు చెబుతాడు. ఈ క్రమంలోనే సూర్యుడు కుంతీదేవికి వరప్రసాదంగా సహస్ర కవచుడిని పసిబిడ్డగా అందిస్తాడు. అందుకే కర్ణుడు సహజ కవచ కుండలాలతో జన్మించాడు. ఇక్కడి వరకూ మనకు తెలిసిందే. అయితే నరనారాయణులు.. సహస్ర కవచుడిని సంహరించలేకపోవడంతో మరు జన్మలో కృష్ణార్జనులుగా జన్మించి కురుక్షేత్రంలో కర్ణుడిని సంహరించారు. ఇదన్నమాట అసలు సంగతి. కాబట్టి మన కర్మల ఫలితం ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదని అంటారు.