మన దేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. అందులో రెండవదిగా శ్రీశైలం క్షేత్రంలో భాసిల్లుతోంది. ఇక శ్రీశైలంలో ఇదొక్కటే కాదు.. నల్లమల అడవుల్లో మనకు తెలియని ఆలయాలు చాలానే ఉన్నాయి. కొన్ని ఆలయాల గురించి వింటే ఆశ్చర్యం వేస్తుంది. అలాంటి ఆలయమే నల్లమల అడవుల్లో ఉన్న ఇష్ట కామేశ్వరి ఆలయం. ఈ ఆలయంలోని ఇష్టకామేశ్వరి దేవి మహిమలు అన్నీ ఇన్నీ కావు. నల్లమల అడవుల్లోని ఈ అమ్మవారి ఆలయం గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇష్టకామేశ్వరి దేవి పేరుతో శ్రీశైల క్షేత్రంలో తప్ప దేశంలో మరెక్కడా ఇలాంటి ఆలయం కనిపించదు.
అయితే ఈ ఆలయం గురించి తెలిసిన వెంటనే శ్రీశైలం వెళితే అమ్మవారి దర్శనం చేసుకునేందుకు వెళ్లితే కుదరదు. ఎందుకంటే ఈ అమ్మవారిని దర్శించుకోవాలనే కాంక్ష మాత్రమే కాదు.. కాస్త అదృష్టం కూడా ఉండాలి. ఈ అమ్మవారిని మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరుకుంటే అది తప్పక నెరవేరుతుందట. ఇక ఇంతటితో అయిపోదు. అమ్మవారి దగ్గరకు వెళ్లి మన కోరికను చెప్పి నుదుటన బొట్టు పెట్టాలట. అప్పుడు మనకు ఒళ్లు జలదరించిన ఫీలింగ్ కలుగుతుందట. ఎందుకంటే అమ్మవారి నుదుటున బొట్టు పెడుతున్నప్పుడు మనకు ఓ విగ్రహానికి పెడుతున్న ఫీలింగ్ రాదు.. మనిషికి పెడుతున్నట్టే అనిపించి తన్మయత్వానికి లోనవుతాం. శ్రీశైలం కూడలి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల అడవుల మధ్య ఈ ఆలయం ఉంటుంది. మన కార్లు వెళ్లలేవు. కేవలం కొన్ని జీపులు వెళుతుంటాయి. చాలా సాహసోపేతమైన ప్రయాణం ఇది.