తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు భూదేవి, శ్రీదేవి సమేతుడై వాహన సేవల్లో పాల్గొంటున్నారు. అంతకు ముందు రోజు సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు పెద్ద ఎత్తున జరిగింది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు ఊరేగింపు నిర్వహించారు. ఆపై స్వామి, అమ్మవార్లు మూడుసార్లు తెప్పపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, వేదపండితుల వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది.
ఇక నాలుగో రోజు బుధవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు తెప్పపై భక్తులకు అభయమిచ్చారు. ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆశీనులై పుష్కరిణిలో ఐదు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు. మంగళవాయిద్యాలు, వేదపండితుల వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది.