తిరుమలలో శ్రీరామనవమి రోజున నిర్వహించే కార్యక్రమాలు..

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక్కడ స్వామివారికి వాహన సేవర, శ్రీరామనవమి ఆస్థానం, తదుపరి రోజు శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 06న ఉదయం 9 నుండి 11 గంటల వరకు రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు హ‌నుమంత వాహ‌నసేవ జరగనుంది. ఏప్రిల్ 06న శ్రీవారి ఆలయంలో రాత్రి 9 నుండి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత వేడుకగా శ్రీరామనవమి ఆస్థానం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 07న రాత్రి 8 నుండి 9 గంటల న‌డుమ శ్రీ రామ పట్టాభిషేకం జరుగనుంది.

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం నిత్యం 60 వేల మందికి పైనే భక్తులు తిరుమలకు తరలి వస్తారు. స్వామివారి క్షణకాల దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండేందుకు సైతం భక్తులు వెనుకాడరు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ వివిధ దర్శన సదుపాయాలను కల్పిస్తోంది. ముందస్తు ప్రణాళిక ప్రకారం తిరుమలకు వచ్చే భక్తుల కోసం ఆన్‌లైన్ ద్వారా వివిధ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం జారీ చేస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యేక ప్రవేశ దర్శనాలతో పాటు ఆర్జిత సేవలు, శ్రీశ్రీనివాస దివ్య అనుగ్రహ హోమం, వర్చువల్ సేవలు అందుబాటులో తీసుకొచ్చింది. భక్తులకు స్లాట్ ప్రకారం మూడు గంటల్లోపే శ్రీవారి దర్శనం కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించిన టికెట్లను మూడు నెలల ముందే ఆన్‌లైన్‌లో విడుదల చేస్తోంది.

Share this post with your friends