తిరుమలలో రథసప్తమినాడు ముందస్తు ప్రణాళికలపై అదనపు ఈవో సమీక్ష

ఫిబ్రవరి 04న తిరుమలలో జరగనున్న రథసప్తమి ఏర్పాట్లపై తిరుమల తిరుపతి దేవస్థంన అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. టీటీడీ జేఈఓ శ్రీ వి.వీరబ్రహ్మం, సివిఎస్వో ఇంఛార్జి శ్రీ మణికంఠ చందోలుతో కలిసి భద్రత, జన రద్దీ నిర్వహణ, తదితర అంశాలపై సమీక్షించారు. టీటీడీ వివిధ విభాగ అధికారులు, విజిలెన్స్- సెక్యూరిటీ మరియు పోలీసులతో సమన్వయం చేసుకుని ముందస్తుగా జన రద్దీని అంచనాలు వేసుకుని అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని అదనపు ఈవో సూచించారు. ట్రాఫిక్, పార్కింగ్ , అత్యవసర టీమ్స్ లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.

సమగ్ర బందోబస్త్ పై ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, ఘాట్ రోడ్డు వాహనాల కదలికను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అత్యవసర పరిస్థితుల్లో తరలించేలించేందుకు వీలుగా కార్యాచరణ రూపొందించాలని కోరారు. ప్రతి ఒక్కరూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేసేలా సమన్వయం చేసుకోవాలని ఆయన ఆదేశించారు. అన్నప్రసాదం, పారిశుద్ధ్యం , శ్రీవారి సేవకులు, వైద్య బృందాలు, ఎల్ ఈ డీ స్క్రీన్లు మరియు ఇతర ఏర్పాట్లపై సమీక్షించారు. అంతకు మునుపు ఆయన శ్రీవారి మెట్టు టోకెన్లు పై కూడా సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్, ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు లు వర్చువల్‌ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.

Share this post with your friends