భద్రాద్రి శ్రీ సీతారాములను ఈ ఏడాది పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. శ్రీరామనవమి రావడంతో పాటు బ్రహ్మోత్సవాలు కూడా జరుగడంతో భద్రాద్రికి భక్తులు పోటెత్తారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో శ్రీ స్వామి వారిని 2,78,730 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గత సంవత్సరం ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కాగా.. గత సంవత్సరం (2024) ఏప్రిల్ నెలలో 2,27,884 మంది భక్తులు శ్రీ సీతారాములను దర్శించుకున్నారు. ఈ ఏడాది గత ఏడాదితో పోలిస్తే 50 వేలకు పైగానే భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ ఏడాది మార్చి 30 నుంచి ఏప్రిల్ 12 వరకూ భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవములు పెద్ద ఎత్తున జరిగాయి. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రామయ్య కల్యాణం కూడా ఈ ఏడాది ఏప్రిల్ 6న స్వామివారి కల్యాణం జరిగింది. మార్చి 30న పంచాంగ శ్రవణం అనంతరం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. అప్పటి నుంచి స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కల్యాణం, శ్రీరామ పట్టాభిషేకం వంటి కార్యక్రమాలు ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు రామయ్య కల్యాణానికి వచ్చారు.