దుర్గమ్మ, అలాగే అమ్మవారి స్వరూపాలైన గ్రామ దేవతలకు ఎందుకు నిమ్మకాయ దండ, పులిహారను నైవేద్యంగా సమర్పిస్తామో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇంటి పూజలో నిమ్మకాయను వాడరు. అసలెందుకు ఇంటి పూజలో నిమ్మకాయ నిషిద్ధమో తెలుసుకుందాం. దుర్గమ్మ ఆలయానికి ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం వెళ్లి అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించడం శుభప్రదం. అయితే అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించే సంప్రదాయాన్ని ఇంట్లో పూజ చేసుకునేప్పుడు మాత్రం పాటించకూడదు. ఎందుకంటే ఇంటి పూజలో సాత్విక తత్వం ఉంటుంది.
అమ్మవారికి ఆలయంలో నిమ్మకాయల దండ సమర్పించడంలో తాంత్రికపరమైన అర్థాలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఆచారాన్ని ఇంట్లో చేసుకొనే పూజల్లో పాటించకపోవడమే మంచిది. ఆలయానికి వెళితే నిమ్మకాయల దండను తీసుకెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు. అనంతరం పూజ చేయించుకుని అమ్మవారి ప్రసాదంగా ఆలయం నుంచి ఒక మూడు నిమ్మకాయలను తీసుకొచ్చి ఒంటి గుమ్మానికి కడతారు. అలా చేస్తే నరఘోషతో పాటు దృష్టి దోషాలు, శత్రు పీడలు తొలగిపోతాయని నమ్మకం. అలాగే ఇల్లు అమ్మ రక్షణలో ఉంటే దుష్ట శక్తులు, నెగిటివ్ ఎనర్జీ ఇంటి దగ్గరకు చేరదట.