తమిళనాడులోని కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశశర్మ బాధ్యతలు స్వీకరించారు. తల్లిదండ్రులు దుడ్డు మంగాదేవి, ధన్వంతరి, కుటుంబసభ్యులతో కలిసి ఆయన ఈ నెల 26న కంచి చేరుకున్నారు. గణేశ్ శర్మ.. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా అన్నవరానికి చెందిన వారు. ఆయన నేడు (బుధవారం) కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. దీనిలో భాగంగా తొలుత కాంచీపురం కామాక్ష్మి అమ్మవారి ఆలయంలో సన్యాస దీక్ష స్వీకరించారు. గణేశ్ శర్మతో ప్రస్తుత పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి సన్యాస దీక్ష మహోత్సవాన్ని జరిపించారు.
ఉదయం 6 గంటల నుంచి 7:30లోపు ఆలయంలోని పంచ గంగ సరస్సు తీరాన ఈ క్రతువును నిర్వహించిన మీదట కామాక్షి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ఆదిశంకరుడి సన్నిధిలో 71వ పీఠాధిపతికి నామకరణం చేశారు. అనంతరం ఊరేగింపుగా శంకరమఠం చేరుకుని అక్కడ మహా త్రిపుర సుందరీ సమేత చంద్రమౌళీశ్వర స్వామివారి దర్శనం చేసుకుని పీఠాధిపతి బాధ్యతలు స్వీకరించారు. గణేశశర్మ 1998లో జన్మించారు. కర్ణాటకకు చెందిన చందుకుట్టు హోసమనే రత్నాకర భట్ శర్మ ఆధ్వర్యంలో వేదవిద్యను అభ్యసించిన అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితుడు పల్లమూడి సత్య వెంకట రమణమూర్తి వద్ద ఉన్నత విద్యను అభ్యసించారు.