భక్తి టీవీ కోటిదీపోత్సవం వైభవంగా సాగుతోంది. ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి దీపోత్సవం ఐదో రోజు ఘనంగా ముగిసింది. నవంబర్ 14న ప్రారంభమైన కోటి దీపోత్సవ మహోత్సవం మహోద్యమంగా కొనసాగుతోంది. ఆ కైలాసమే ఇలకి దిగివచ్చిందా అనేలా.. కోటిదీపోత్సవ వేదికను ముస్తాబు చేశారు. ఒక్కసారైనా కోటిదీపోత్సవానికి వెళ్లాలి అనేలా భక్తులలో ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఇల కైలాసంగా మారిపోయిన ఎన్టీఆర్ స్టేడియం శివనామస్మరణతో మార్మోగుతోంది.
ఐదోరోజు కోటి దీపోత్సవం వేదికైన ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో మార్మోగాయి. సర్వ శుభదాయకం భక్తులచే స్వయంగా నృసింహ స్వామి విగ్రహాలకు రక్షా కంకణ పూజ నిర్వహించారు. అనంతరం వీక్షించిన జన్మధన్యమయ్యే సింహాచలం వరాహలక్ష్మీ నృసింహ కల్యాణాన్ని చూసి తరించారు భక్తులు. శేషవాహనంపై సింహాద్రిఅప్పన్న దర్శనభాగ్యంతో భక్తులు పులకరించిపోయారు. సకల సౌభాగ్యాలను ప్రసాదించే కాంచీపుర కామాక్షి, కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవార్లు భక్తులను అనుగ్రహించారు. కర్ణాటక హల్దీపుర మఠం శ్రీవామనాశ్రమం స్వామి అనుగ్రహభాషణం చేశారు. బృందావనం ఆనంద్‌ధామ్ శ్రీస్వామి రితీశ్వర్ ఆశీర్వచనం చేశారు. శ్రీమతి అరుణాచల మాధవి ప్రవచనామృతాన్ని వినిపించారు. కోటిదీపాల వెలుగులు, సప్తహారతుల కాంతులు.. స్వర్ణలింగోద్భవ వైభవాన్ని భక్తులు తిలకించి తరించిపోయారు. మహాదేవునికి మహానీరాజనంతో పాటు అద్భుత సాంస్కృతిక కార్యక్రమాలతో ఐదో రోజు కోటి దీపోత్సవ వేడుక విజయవంతంగా ముగిసింది. నాలుగో రోజు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో.. కోటిదీపోత్సవ వేదిక జనసంద్రంగా మారిపోయింది. అంతేకాకుండా.. దీపాలను వెలిగించి భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. పిల్లా, పెద్ద అని తేడా లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ మహాదేవుని ఆశీస్సులు పొందారు.
ఇదిలా ఉంటే.. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి 9.30 వరకు ఎన్టీఆర్ స్టేడియం దీపాల కాంతులతో వెలిగిపోయింది. చూడటానికి ఎంతో అందంగా అద్భుతంగా అనిపించింది. మరోవైపు భక్తి టీవీ కోటిదీపోత్సవంలో పాల్గొనే భక్తులకు పూజాసామగ్రి, దీపారాధన వస్తువులను రచనా టెలివిజన్ పక్షాన పూర్తి ఉచితంగా అందించింది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా భక్తి టీవీ ఈ దీప మహాయజ్ఞాన్ని నిర్వహిస్తూ వస్తుంది.. ఈ నెల 14 నుంచి 27వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో కోటిదీపోత్సవం జరగనుంది.. అయితే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆ మహాశివుడి అనుగ్రహం పొందాలని భక్తి టీవీ ఆహ్వానం పలుకుతోంది. కార్తిక మాసం, నాగుల చవిత వేళ.. కోటిదీపోత్సవంలో పాల్గొనండి.. ఆ మహాదేవుడి కృపకు పాత్రులుకండి..