శివుని శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు దేవతలు ఏం చేశారంటే..

శివుడికి చాలా పేర్లున్నాయి. వాటిలో భోళా శంకరుడు కూడా ఒకటి. భక్తితో ఒక బిల్వ పత్రం ఒకదానిని శివుడి వద్ద పెట్టినా కూడా ఆయన సంతోషించి వరాల జల్లు కురిపిస్తాడట. పరమశివుడికి కొన్ని వస్తువులు చాలా ఇష్టం. వాటిని సమర్పిస్తే చాలు శివుడు పరమానందభరితుడవుతాడట. శివుడికి ఇష్టమైన వాటిలో బిల్వ పత్రం కూడా ఒకటి. ఈ చెట్టులో చాలా మంది దేవతలు ఉంటారట. బిల్వ చెట్టు మూలాల్లో గిరిజాదేవి, కాండంలో మహేశ్వరి, కొమ్మలో దాక్షాయణి, ఆకుల్లో పార్వతీ దేవి, పుష్పంలో గౌరీ దేవి ఉంటారట. అందుకే బిల్వ పత్రానికి అంతటి ప్రాముఖ్యత.

ముఖ్యంగా శ్రావణ మాసంలో దేవతారాధన సర్వసాధారణంగానే చేస్తుంటాం. అసలు శివుడికి బిల్వ పత్రం అంటే ఎందుకంత ఇష్టం అనే దానికి ఒక కథ ఉంది. శివ పురాణం ప్రకారం.. క్షీర సాగర మథనం జరిగినప్పుడు విషం కూడా వచ్చింది. దానిని ఏం చేయాలో తెలియక అంతా ఇబ్బంది పడుతుంటే.. పరమేశ్వరుడు దానిని స్వీకరించి గరళంలో దాచేశాడు. అయితే ఆ కాసేపటికే శివుడి శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిందట. గొంతు నీలంగా మారిపోయిందట. ఆ వేడికి భూమిపై ఉన్న జీవులన్నీ కూడా చాలా ఇబ్బంది పడ్డాయట. అప్పుడు దేవతలంతా ఆలోచించి శివుని శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గించేందుకు బిల్వపత్రం ఇచ్చారట. అది తిన్నాక విష ప్రభావంతో పాటు శివుని శరీరంలోని వేడి కూడా తగ్గిందట. అప్పటి నుంచి శివుడికి భక్తులంతా బిల్వపత్రం సమర్పించే సంప్రదాయం ప్రారంభమైందట.

Share this post with your friends