వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి క్షేత్రం.. స్థల పురాణం

గౌతమీ గోదావరిలో కొట్టుకువస్తున్న ఒక వృక్షం నౌకాపుర వాసులను విశేషంగా ఆకర్షించింది. కానీ దాన్ని ఎవరూ ఒడ్డుకు చేర్చలేకపోయారు. ‘‘కలి ప్రభావంతో మీరు గుర్తించలేకపోతున్నారు. నదీగర్భంలో కృష్ణ గరుడ వాలినచోట చందనపేటికలో ఉన్నాను. నన్ను వెలికితీసి ప్రతిష్ఠించుకోండి’’ అని స్వామి కలలో కనబడి చెప్పాడు. ఆ ప్రకారం లభ్యమైన చందనపేటికను ఒడ్డుకు చేర్చి నిపుణుడైన శిల్పితో తెరిపించారు దానిలో శంఖ, చక్ర, గదాయుధాలతో, కంఠంలో వనమాలతో నుదుట ఊర్ధ్వపుండ్రాలతో పద్మాలవంటి కనులతో ఒప్పుతున్న స్వామి దివ్యమంగళ విగ్రహం కనబడింది. అంతలో దేవర్షి నారదుడు అక్కడకు చేరుకుని స్వామిని స్వయంగా ప్రతిష్ఠించాడు. మరో కథనం ప్రకారం స్వామివారు అశ్వారూడులై తిరుపతినుండి బయలుదేరి మార్గమధ్యలో ద్వారకాతిరుమలనందు ఓ అంశను, ఆత్రేయపురం మండలం వాడపల్లిలో మరో అంశను, నక్కపల్లివద్ద ఉపమాకలోని గరుడాద్రిపై మరో అంశను స్థాపించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి.

వాడపల్లి దర్శనం
నిలువెత్తు దివ్యమంగళ స్వరూపం వాడపల్లి వేంకటేశ్వరునిది. ఆనంద ధాముడై లక్ష్మీ స్వరూపుడై దర్శనమిస్తాడు. మూడు మండపాలలో ఎత్తైన ప్రాకార గోపురాలతో దేవాలయంలో కనువిందు చేస్తాడు. ముందుభాగంలో పదహారు స్తంభాలతో కూడిన యజ్ఞశాల కనిపిస్తుంది. ప్రధానాలయానికి కుడివైపున క్షేత్రపాలకుడు, ద్వాదశ గోపాల ప్రతిష్ఠలలో ఒకటిగా చెప్పుకునే శ్రీరుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణు గోపాలస్వామి దర్శనం చేసుకోవాలి. ఉత్తరం వైపున అలివేలుమంగ, అభిముఖంగా గరుత్మంతుని ఆలయం కనిపిస్తాయి. స్వామిని ఏడు శనివారాలు దర్శిస్తే ఏడేడు జన్మముల పుణ్యఫలం.. ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు.

కల్యాణ శ్రీనివాసం
చైత్రశుద్ధ ఏకాదశి రోజున స్వామి కల్యాణం, తీర్థం జరుగుతాయి. వేలాదిగా భక్తజనం తరలి వస్తారు. సంతానం లేని వారు వాడపల్లి వెంకన్నను దర్శించుకుంటే సంతానవంతులౌతారని నమ్మిక. పటికబెల్లం, హారతి, చిల్లరలతో సంతానం కలిగిన తరువాత స్వామికి తులాభారం సమర్పించుకుంటారు. వాడపల్లికి రావులపాలెం నుంచి బస్సు, ఆటో సౌకర్యం ఉంది.

Share this post with your friends