తెలుగు సంవత్సరంలో మొదటి పండుగ “ఉగాది”.. ఆచరించాల్సిన విధివిధానాలు

చైత్రమాసం, శుక్లపక్షంలో మొట్టమొదటి తిథి అయిన పాడ్యమి రోజున కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అదే ఉగాది. మనం చాంద్రమానాన్ని అనుసరిస్తాం. ఇందులో 60 సంవత్సరాలున్నాయి. ఈ అరవై సంవత్సరాలే మళ్లీ మళ్లీ పునరావృతమవుతూ ఉంటాయి. కొత్త సంవత్సరం ప్రారంభమైనప్పుడు దానిని అనుష్ఠించడానికి కావలసిన రీతిని మన ఋషులు నిర్ణయించారు. సంవత్సరాదినాడు మనం అనుసరించాల్సిన విధానాలేమిటో వారు స్పష్టంగా తెలియ చేశారు.

• ప్రాతఃకాలంలో స్నానం చేయడం ఉగాది నాడు అనుసరించాల్సిన మొట్టమొదటి నియమం. స్నానానికి ముందు ఇంటిలోని పెద్దవారితో తలపై నువ్వుల నూనెను పెట్టించుకుని ఆశీస్సులు తీసుకుంటారు. ఇలా చెయ్యడం వల్ల అలక్ష్మి (జ్యేష్ఠాదేవి) తొలగిపోతుంది. శ్రీసూక్తం చెప్పుకునేటప్పుడు, క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్షీం నాశయామ్యహమ్ అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుద మే గృహాత్ – అని కోరుకుంటాం. అంటే మా ఇంటిలో ఆకలి, దప్పిక, మలినం వంటివి ఉండకూడదు. లక్ష్మీదేవి కంటే ముందు పుట్టిన జ్యేష్ఠాదేవి స్వరూపమైన దారిద్ర్యం మా దరికి చేరకూడదు. మేము పుత్రులతో, మిత్రులతో, సంపత్తితో, వాహనాదులతో, ధాన్యసమృద్ధితో సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకోవడం. పరిశుభ్రత లేనిచోట లక్ష్మి ఉండదు కనుక, ముందుగా తలంటి స్నానం చేయాలి. అనంతరం కొత్త వస్త్రాలు ధరించాలి.

• నూతన వస్త్రధారణ అనంతరం కులదైవాన్ని ఆరాధించు కోవాలి. ఉగాది పచ్చడి ప్రసాదాన్ని తయారుచేసి స్వామికి నివేదించాలి.

• యద్వర్షాదౌ నింబసుమం శర్కరామ్ల ఘృతైర్యుతం పశ్యతం పూర్వయామేశ్యా తద్వర్షం సౌఖ్యదాయకం- అంటుంది శాస్త్రం. నింబసుమం అంటే వేపపూత. ఉగాది పచ్చడిలో ఇది ప్రధానంగా ఉండాలి. వేపచెట్టును గురించి చెబుతూ, ‘‘వేపచెట్టును ఆశ్రయించి ఉండడం, వేపచెట్టు క్రింద నిద్రించడం, వేపచెట్టు గాలి పీల్చడం ఆరోగ్యానికి పరమ కారణాలు’’ అని అమరకోశం వ్యాఖ్యానిం చింది. వేపచెట్టు పరదేవతా స్వరూపం. వసంత రుతువులో మాత్రమే పూచే వేపపువ్వులో విశేషమైన రోగనిరోధక శక్తి ఉంటుంది. ఆ వేపపువ్వును మొదటిగా నీటిలో కలపాలి. వేపపువ్వు వేసిన నీటిలో కొత్తబెల్లం వేస్తారు. ఆ తరువాత కొత్త చింతపండును కూడా వేసి చిక్కని పులుసు పదార్ధంగా ఆ ప్రసాదాన్ని తయారుచేస్తారు.

• భగవంతుని పేరిట ఏ వృక్షజాతి లేదు. ఆ అదృష్టం ఒక్క మామిడి చెట్టుకే దక్కింది. ఈ వృక్షాన్ని రసాల వృక్షం అంటారు. భగవంతుణ్ణి రసోవై సః అంటారు. ఈ చెట్టు ఆకులు ప్రతి మంగళకరమైన కార్యాలకూ ఇంటిముందు తోరణాలుగా కట్టుకుంటాం. ప్రతీ శుభ కార్యంలోనూ వినియోగిస్తాం కూడా. అలాంటి మామిడి ముక్కలను కూడా ఉగాది పచ్చడిలో కలుపుకోవడం మన సంప్రదాయం.

• వీటన్నింటి మిశ్రమంతో తయారైన షడ్రుచుల ఉగాది పచ్చడిని మొదట ఈశ్వరునికి నివేదించాలి. ఈ నైవేద్యాన్ని స్వీకరించిన వారికి ఈ సంవత్సరమంతా సౌఖ్యదాయకంగా భాసిల్లుతుంది.

• తరువాత పెద్దలను, గురువులను దర్శించాలి. దైవదర్శనం చేయాలి. గోపూజ, వృషభ పూజ చేయాలి. మామిడి పళ్లు, చల్లటి మంచినీరు, కొత్త వస్త్రాలు, విసనకర్రలు, మజ్జిగ వంటివి ఇతరులకు దానం చేసుకుంటే ఎంతో మంచిది.

• తప్పనిసరిగా పంచాంగాన్ని పూజించాలి. పంచాంగ శ్రవణం చేయాలి. పంచాంగం అంటే అయిదు అంగములు కలిగినది. తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగము. పంచాంగంలో ఒక సంవత్సర కాలాన్ని ప్రమాణం చేసుకుని, ఆ కాలమునందు గ్రహాల సంచారం, ఆ గ్రహాలు కలిగించే ఫలితాలు, ఆయా నక్షత్ర జాతకులు పొందబోతున్న శుభాశుభ ఫలితాలు, రాజపూజ్య అవమాన, ఆదాయ వ్యయాలు, కందాయ ఫలాలు సవివరంగా ఉంటుంది. గ్రహాలన్నీ ఈశ్వరుని అధీనంలో ఉండి సంచరిస్తాయి. పంచాంగ శ్రవణం చేసి ఈశ్వరుని ప్రార్ధించిన వారికి ఆయన కృపవలన శుభఫలితాలు కలుగుతాయి.

• సంవత్సర ఫలితాలు మనకు అనుకూలంగా ఉన్నట్లయితే అహంకారం, అతిశయం పొందకూడదు. ఒకవేళ ఏదైనా ఉపద్రవం పొంచివున్నదని పంచాంగం సూచిస్తే దానినుంచి ఉద్ధరించే పరమశక్తి సంపన్నుడైన పరమేశ్వరుని ఆశ్రయించాలి.

• సంప్రదాయ దుస్తుల్లోనే దేవాలయ దర్శనం చేయాలి. పండుగనాడు ఇంటిలోని పెద్దవారికి, గురువులకు నమస్కరించి ఆశీర్వచనం తీసుకోవడం మరిచిపోకూడదు. మన తెలుగుజాతి సంస్కృతి, సంప్రదాయమైన కట్టుబొట్టు పాటించాలి. తెలుగు సంస్కృతిని నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలి.

Share this post with your friends