సిరుల తల్లి వరాల కల్పవల్లి.. “లక్ష్మీ పంచమి” విశిష్టత

ఆదిలక్ష్మియే సమస్తసృష్టిని నిర్మించి పాలిస్తోంది. ఆమె పలు సందర్భాలలో వివిధ అవతారాలను దాల్చి శ్రీమహావిష్ణువు తిరిగి చేరుతుంది. విష్ణువుకు నిత్యానపాయిని అయిన మహాలక్ష్మిని సంపదలు అనుగ్రహించే దేవతగా ప్రధానంగా పూజిస్తారు. ఆమెను ఆరాధించిన వారికి అభివృద్ధి కలుగుతుంది.

లక్ష్మి అంటే ఐశ్వర్యం. ఐశ్వర్యం కోరుకోనివారు ఉండరు. అందువల్ల అందరూ లక్ష్మీ భక్తులే. ధనం, నగలు, ఆహార పదార్థాలు ఇవన్నీ ఐశ్వర్యం కిందకే వస్తాయి. చైత్రశుద్ధ పంచమిని లక్ష్మీ పంచమిగా జరుపుకుంటారు. ఈ శుభదినాన లక్ష్మీనారాయణులను పూజిస్తే సర్వసంపదలు కలుగుతాయని, ధన-కనకవస్తు-వాహనప్రాప్తి సిద్ధిస్తుందని ధర్మసింధు గ్రంథం వర్ణించింది. లక్ష్మీదేవిని ప్రధానంగా పూలతో అర్చించాలి. చందనం, మారేడు, కుంకుమ ఆమెకు ప్రీతికరమైనవి. పాయసం, వడపప్పు, పానకం నివేదించవచ్చు. మానవ జీవితానికి ప్రధాన లక్ష్యం ఆధ్యాత్మిక సంపదను సాధించడం. మహాలక్ష్మీదేవి నరుని శరీరంలో ఒక్కొక్క స్థానంలో ఉంటుంది. అలా ఏ స్థానంలో ఉంటే ఏ పుణ్యం లభిస్తుందో మార్కండేయ పురాణం చెప్పింది. లక్ష్మి మానవుల పాదాల్లో ఉంటే సొంత గృహాన్నిస్తుంది. తొడలపై ఉంటే వస్త్రాలను, రత్నాలను, వివిధ రకాలైన సుగంధ ద్రవ్యాలను ఇస్తుంది. గుహ్య స్థానంలో ఉంటే అదృష్టాన్ని ఇచ్చే భార్యను ప్రసాదిస్తుంది. హృదయంపై ఉంటే కోరికలను తీరుస్తుంది. కంఠంపై ఉంటే కంఠాభరణాలను ఇస్తుంది. నోటిలో ఉంటే మధుర ఆహారాలను, చక్కని మాటలను, కవిత్వాన్ని ప్రసాదిస్తుంది. నెత్తిపై ఉంటే అతన్నివిడిచిపెట్టి మరొకరిని ఆశ్రయిస్తుంది.

లక్ష్మీదేవి నివాస స్థానాలు సత్యవంతులలో, సలక్షణమైన గృహములలో, జయజయ ధ్వానాలలో, ఏనుగు – గుర్రం – గోవులలో, ఛత్ర చామరాల్లో, స్వయంవరాల్లో, రత్నాల్లో, దీపాల్లో, అద్దంలో, మంగళకర ద్రవ్యాల్లో లక్ష్మీదేవి నివాసముంటుంది. శాంత స్వరూపిణి అయిన లక్ష్మీదేవికి నచ్చనివి కొన్ని ఉన్నాయి. వాటిని అవగాహన చేసుకోవడం సర్వవిధాల శుభప్రదం. సూర్యోదయ సమయంలో భుజించడం, కాలివేళ్లతో నేలను రాయడం, పగటిపూట నిద్రించడం ఇవన్నీ లక్ష్మీదేవికి కోపాన్ని తెప్పిస్తాయి. శుచి, శుభ్రత శ్రీమహాలక్ష్మీకి అసలు సిసలైన పూజ. ఎంత సహనంగా ప్రవర్తిస్తామో అంతగా లక్ష్మి కరుణిస్తుంది. సహనం లక్ష్మీదేవి, కోపం జ్యేష్ఠాదేవి అని పెద్దలు చెబుతారు. శ్రీమహాలక్ష్మికి ఎరుపు రంగు వస్త్రాలు, పువ్వులు, గంథమంటే ఇష్టం. మంచి మాటలు మాట్లాడేవారంటే మిక్కిలి ప్రీతి. ‘ఓం లక్ష్మీ కమల వాసిన్యై స్వాహా’ అనే మంత్రాన్ని నిత్యం పఠించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి.

Share this post with your friends