యాదగిరిగుట్ట శ్రీ లక్మినరసింహ స్వామి వారి జయంతి ఉత్సవాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా నేటి ఉదయం స్వస్తివచనం, పుణ్యాహవచనం జరిగాయి. అనంతరం లక్షకుంకుమార్చన పూజలతో పాటు తిరువేంకటపతి అలంకార సేవా ఉత్సవం నిర్వహించనున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. దీనిలో భాగంగా మూడు రోజుల పాటు స్వామి వారికి జరిగే నిత్య కైంకర్యములు, ఆర్జిత సేవలు రద్దు చేసినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. నేటి సాయంత్రం మృత్స్యుంగ్రహణం, అంకురార్పణ, హవనం, గరుడ వాహనం, పరవాసుదేవ అలంకార సేవలను నిర్వహించనున్నారు.
21న ఉదయం నిత్యమూలమంత్ర హవనం, లక్షపుష్పార్చన, కాళీయమర్ధన అలంకార సేవోత్సవం… సాయంత్రం నారసింహ మూల మంత్ర హవనం, నిత్య పూర్ణాహుతి, గర్భాలయంలో మూలాలకు సహస్ర కలశాభిషేకం, రాత్రి నరసింహ జయంతి, ఆవిర్భావ, మహానివేదన ఉత్సవాలు ముగియనున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారు. దీనికి ప్రత్యామ్నాయంగా ప్లాస్టికేతర వస్తువులను వాడాలని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎ.భాస్కరరావు దేవస్థానంలోని పలు శాఖలను ఆదేశించారు. ఈ క్రమంలోనే నిత్యకల్యాణం, హోమం, జోడు సేవల వంటి వివిధ ఆర్జితసేవల్లో పాల్గొనే భక్తులు జూన్ 1 నుంచి సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని తెలిపారు. వీఐపీ బ్రేక్ దర్శనానికి వచ్చే భక్తులకు సైతం డ్రెస్ కోడ్ వర్తిస్తుందన్నారు.