యాదాద్రి ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సంప్రదాయ దుస్తులతో వస్తేనే ఆలయంలోకి అనుమతించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది. తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఇక నుంచి సాంప్రదాయ దుస్తులు ధరించాలని నిబంధనను ఆలయ అధికారులు విధించారు. పాశ్చాత్య సంస్కృతిని బాగా అలవాటు చేసుకున్న ప్రజానీకం ఆలయాల్లోకి సైతం పాశ్చాత్య సంస్కృతికి సంబంధించిన దుస్తులతో వస్తున్నారు. ఈక్రమంలోనే ఇప్పటికే కొన్ని ఆలయాల్లో సంప్రదాయ దుస్తులతో ఆలయాల్లోకి రావాలన్న నిబంధన ఉంది.
జూన్ 1 నుంచి ఈ నిబంధన యాదాద్రి ఆలయంలోనూ అమల్లోకి రానుంది. ఈ మేరకు ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా నిత్య కళ్యాణోత్సవం, సుదర్శన నారసింహ హోమం, వెండి జోడు సేవ తోపాటు ఆర్జిత సేవలో పాల్గొను భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులు ధరించాలి. భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట అనే చిన్న పట్టణంలోని ఒక కొండపై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం ఉంది. యాదాద్రి ఆలయాన్ని తెలంగాణ తిరుపతిగా పేర్కొంటారు. ఇటీవలి కాలంలో ఈ ఆలయం బాగా అభివృద్ధి చెందింది.