మృగశిర కార్తె రోజునే చేప మందు ఎందుకు తీసుకోవాలి?

రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలతో సతమతమవుతాం. దాని నుంచి రిలాక్సేషన్ కోసం మృగశిర కార్తె వస్తుంది. దీనినే రైతులు ఏరువాక కాలం అని కూడా అంటారు. ఇక మృగశిరకార్తె వచ్చిందంటే చాలు చేపమందు ప్రసాదాన్ని అందజేస్తూ ఉంటారు. హైదరాబాద్‌లో ఇచ్చే ఈ చేపమందు ప్రసాదం కోసం దేశ వ్యాప్తంగా ఉబ్బసం వ్యాధితో బాధపడే వారు వస్తుంటారు. అసలు చేపలు ఎప్పుడైనా దొరుకుతాయి కదా.. మృగశిర కార్తె రోజే ఎందుకు చేపమందు ప్రసాదం అందజేస్తారు? దీని వెనుక కథ ఏదైనా ఉందా? వాస్తవానికి వైశంపాయనుడు మృగశిర కార్తె రోజునే తన శిష్యుడైన యాజ్ఞవల్క్యునికి తైత్తిరీయోపనిషత్తును బోధించాడని అంటారు. అయితే తైత్తిరీయోపనిషత్తు వరుణదేవుని ప్రార్థనతోనే ప్రారంభం అవుతుంది.

చంద్రుడు ఒక్కొక్క నక్షత్రం సమీపంలో 14 రోజుల పాటు ఉంటాడు. కాబట్టి చంద్రుడు ఏ నక్షత్రం సమీపంలో ఉంటే.. ఆ కార్తెకు ఆ పేరు పెడతారు. ఆ పేర్లు అశ్వినితో ప్రారంభమై రేవతితో ముగుస్తాయి. ఇక అశ్వనికి.. రేవతికి నడుమ మొత్తం ఇరవై ఏడు నక్షత్రాల పేర్లతో ఉన్నాయి. ఇప్పుడు మృగశిర నక్షత్రానికి సమీపంలో చంద్రుడు ఉండటం వల్ల దీనికి మృగశిర కార్తె అనే పేరు వచ్చింది. ఇక ఈ కార్తెలో వచ్చే మొదటి రోజును ప్రాంతాలను బట్టి మృగశిర, మృగం, మిరుగు, మిర్గం పేర్లతో వ్యవహరిస్తారు. ఈ రోజున ఇంగువను బెల్లంలో కలుపుకుని తింటారు. ఇంగువ శరీరంలో ఉష్టాన్ని ప్రేరేపించి వర్షాలకాలంలో వచ్చే వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ క్రమంలోనే ఆస్తమా బాధితులు చేపలు లేదంటే చేప మందు తీసుకుంటే వ్యాధులు దరిచేరవట. అందుకే చేపమందు తీసుకుంటారు.

Share this post with your friends