సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం ఈ ఒక్కరోజే ఎందుకు? 12 గంటలు మాత్రమే ఎందుకు?

అక్షయ తృతీయ రోజున సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం భక్తులకు కనువిందు చేస్తుంది. అయితే స్వామివారి నిజరూప దర్శనం ఏడాదిలో ఈ ఒక్కరోజు అది కూడా 12 గంటలు మాత్రమే కనిపిస్తుంది. ప్రహ్లాదునికి రెండు అవతారాలను ఏకకాలంలో దర్శించుకునే వరం లక్ష్మీనరసింహ స్వామి వారు కల్పించిన విషయం తెలిసిందే. ఆ తరువాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పురూర వుడు అనే రాజు సింహగిరి మీదుగా విమానంపై వెళుతున్నాడట. స్వామివారి ఆలయ సమీపానికి విమానం రాగానే అలా ముందుకు కదలకుండా నిలిచిపోయి.. బలవంతంగా కిందకు ఆకర్షించబడిందట. వెంటనే కిందికి దిగిన పురూరవుడు అసలక్కడ ఏం మహత్యం ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. అక్కడంతా వెదకగా ఓక పుట్టలో కప్ప బడి ఉన్న శ్రీ వరాహనరసింహస్వామి కనిపించాడు.

ఈ గిరి మీదనే స్వామివారి గుడి నిర్మించాలని.. విగ్రహాన్ని సంవత్సరకాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజ రూప దర్శనం కలిగేటట్లు చేయాలని పురూరవుడికి ఆ శవాణి పురూరవుడికి చెప్పిందట. దీంతో పురూరవుడు వరాహ నరసింహ స్వామికి అక్కడే దేవాలయాన్ని నిర్మించాడు. అయితే ఆలయ నిర్మాణాంతరం స్వామివారు పురూరవుడికి కలలో కనిపించి ఇంతకాలం మట్టితో కప్పబడి ఉన్నందున తన శరీరానికి తాపము లేదని.. కాబట్టి తనపై నుంచి ఎంత పుట్ట మట్టిని తొలగించారో అంతే పరిమాణంలో తనపై చందనం పూత వేసి తాపం కలుగకుండా చేయాలని చెప్పాడట. పుట్టను తవ్వి తీసిన మట్టి 12 మణుగులు కావడంతో అంతే పరిమాణం ఉన్న చందనాన్ని స్వామివారికి నాలుగు విడతలుగా పూస్తారట. కాబట్టి అక్షయ తృతీయ రోజున స్వామివారికి 12 మణుగుల చందనాన్ని తొలగించి 12 గంటల పాటు నిజరూపదర్శనం కలిగించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక స్వామివారికి 12 మణుగుల చందనాన్ని అక్షయ తృతీయ రోజున నిజరూప దర్శనం ముగిసిన అనంతరం ఒకసారి, వైశాఖ పూర్ణమి నాడు రెండోసారి, జేష్ట పూర్ణిమ నాడు మూడోసారి, ఆషాఢ పూర్ణిమ నాడు నాలుగోసారి మూడు మణుగుల చొప్పున 12 మణుగుల చందనాన్ని పూసి స్వామివారి తాపం చల్లబరుస్తూ ఉంటారు.

Share this post with your friends