భద్రాద్రిలో రాముల వారు పద్మాసనంగా.. ఆయన తొడ మీద అమ్మవారు కూర్చొని ఉంటారు. సీతారాముల పక్కన లక్ష్మణుడు నిల్చొని దర్శనమిస్తాడు. స్వామి వారు నాలుగు చేతులు, శంఖ చక్రాలతో ఉంటారు. అందుకే స్వామివారిని రామ నారాయణుడని అంటారు. మరి స్వామిని వైకుంఠ నారాయణుడని ఎందుకు అంటారు? అది కూడా భద్రాచలంలోని రామయ్యనే అంటారెందుకు? అంటే దీనికి కూడా ఒక కథ ఉంది. భధ్రాచలంలోని శ్రీరాముడిని వైకుంఠ రాముడు అని అంటారు.
శ్రీరాముల వారు వైకుంఠానికి వెళ్లిన తర్వాత తిరిగి భూమి మీదకు వచ్చి తన భక్తుడైన భద్రుడి కోరికను తీర్చి భద్ర పర్వతంపై నిలిచాడు. వైకుంఠం నుంచి రామ రూపంలో వచ్చి భద్రాద్రి కొండపై వెలిశాడు కాబట్టి ఆయనను వైకుంఠ రాముడని అంటారు. ఇంకా ఇక్కడి రాముడిని మోక్ష రాముడు, భద్రాచల రాముడు, ఓంకార రాముడని భక్తులు పిలుచుకుంటారు. ఇక సీతా రామ లక్ష్మణ విగ్రహాలు.. అకార, ఉకార, మకారాలకు ప్రతిబింబాలుగా ఉంటాయి. అందుకే రాముల వారిని ఓంకార రాముడని అంటారు.