పూజల్లో కలశం ఎందుకు పెడతారు? దీని వెనుకున్న కథేంటి?

హిందువులు పూజా సమయాల్లోనూ.. వివాహాది శుభకార్యాల్లోనూ తప్పక కలశాన్ని తయారు చేసి పూజలు నిర్వహించడం ఆనవాయితీ. అసలు ఈ కలశం ఎందుకు పెడతారు? ఎందుకు పూజిస్తారు? అంటే.. కలశ పూజ అనేది ఎప్పటి నుంచో వస్తున్నదే.. ఈనాటిది కాదు. కలశాన్ని దివ్యమైన ప్రాణశక్తితో నిండివున్న జడ శరీరానికి ప్రతీకగా భావిస్తారు. ఇత్తడి లేదా రాగి చెంబును తీసుకుని.. దానిలో నీటిని నింపి.. దానిని మామిడి ఆకులతో అలంకరించి.. దానిపై కొబ్బరికాయకు ఎరుపురంగు వస్త్రాన్ని చుట్టి పెడతారు. దీనినే కలశం అంటారు. అసలు ఈ కలశాన్ని ఎందుకు పూజిస్తారు?

దీనికి ఒక కథ ఉంది. పూర్వం సృష్టి ఆవిర్భవానికి ముందు… పాలసముద్రంలో శ్రీ మహావిష్ణువు తన శేషతల్పంపై పవళించి ఉండగా… ఆ సమయంలో అతని నాభి ప్రాంతం నుంచి ఒక పద్మం వెలువడిందట. ఆ పద్మం నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడట. ఆ తరువాత బ్రహ్మ.. ఈ యావత్ ప్రపంచాన్ని సృష్టించాడు. ఈ రకంగానే కలశంలో ఉన్న నీరు సృష్టి ఆవిర్భవంలో ప్రథమంగా పుట్టిన నీరని అంటారు. విశ్వంలో ఉన్న ప్రాణులన్నింటికీ అలాగే జడ పదార్థాలకు దీనిని అంతర్గత సృష్టికర్తగా భావిస్తారు. ఇక కలశంపై ఉంచే ఆకులు, కొబ్బరికాయను సృష్టికి ప్రతీకగా పేర్కొంటారు. కలశానికి ఎరుపు లేదా తెలుపు దారంతో కంకణం కడదారు. ఇది సృష్టిలో బంధించిబడిన ప్రేమను సూచిస్తుంది. సాగర మథనంలో పుట్టిన అమృతాన్ని భగవంతుడు కలశంతో తీసుకొచ్చాడట. కాబట్టి కలశానికి పూజల్లో అత్యంత ప్రాధాన్యమిస్తారు.

Share this post with your friends