హనుమంతునికి సిందూర సేవ ఎందుకు ఇష్టం?

హనుమంతుడు సిందూరప్రియుడు. హనుమంతుని భక్తులందరూ తప్పనిసరిగా సిందూరం ధరిస్తారు. అభిషేకం అనంతరం దేవాలయంలో హనుమంతునికి సిందూరసేవ చేస్తారు. ఆయనకు సిందూరం ఇష్టమనేందుకు ఆధారమైన గాథ ఒకటి ఉంది. అయోధ్యానగరంలో ఒకసారి సీతాదేవి. పాపట సిందూరం ధరించడాన్ని ఆంజనేయస్వామి గమనించాడు. ఎందుకు పాపటబొట్టు పెట్టుకుంటున్నావని అడిగితే “నేను అలా పెట్టుకుంటే నీ తండ్రి రామయ్యకు ఆయుష్షు పెరుగుతుందయ్యా” అని చెప్పింది తల్లి. వెంటనే హనుమంతుడు సిందూరంలో పొర్లాడాడు.

పొడిపొడిగా ఉన్న సిందూరం ఒంటికి అంటుకోక రాలిపోవడం మొదలుపెట్టింది. ఈసారి నూనె తొట్టెలో మునిగి వెళ్లి పిదప సిందూరం అంటించుకున్నాడు. ఆయస ముగ్ధభక్తికి మెచ్చిన శ్రీరాముడు మంగళవారం నాడు ఎవరైతే హనుమంతునికి సిందూర సేవచేస్తారో వారిని తాను అనుగ్రహిస్తానని హామీ ఇచ్చాడు. సిందూర సేవతో పాటుగా హనుమంతునికి ప్రీతికరమైన నైవేద్యాలున్నాయి. వాటిలో గారెలదండ మొక్కు సుప్రసిద్ధమైనది. దీనివల్ల శనిదోషం పరిహారం అవుతుంది. బియ్యపు పిండి, మైదాపిండి, బెల్లం, కొబ్బరి తురుము వంటి వాటితో చేసే అప్పం మధురపదార్ధం. హనుమదర్చనలో అప్పాలను వినియోగిస్తే సాత్త్విక, రాజస ప్రయోజనాలు రెండూ సిద్ధిస్తాయి.

Share this post with your friends