బ్రహ్మ దేవుడు దగ్గరుండి.. గౌతమ మహర్షి, అహల్యల వివాహం జరిపిస్తాడు. అనంతరం వారికి శతానందుకు అనే కుమారుడు జన్మిస్తారు. ఆ తరువాత కొన్నాళ్లకు గౌతమ మహర్షి తపో దీక్షను చేపడతాడు. ఆ దీక్ష స్వర్గాన్నే కదిలించేలా ఉండటంతో స్వర్గ లోకాధిపతి అయిన ఇంద్రుడు ఆందోళనకు గురవుతాడు. తన పదవి పోతుందన్న భయంతో గౌతముని దీక్షకు భంగం కలిగించాలని నిర్ణయించుకుని దేవతల సాయం కోరుతాడు. అహల్య అందం కూడా ఇంద్రుడిని ముగ్దుడిని చేస్తుంది. స్వర్గలోకాన్ని కాపాడుకుంటూనే అహల్యను కూడా దక్కించుకోవాలనుకుంటాడు. తెల్లవారకముందే కోడిగా మారి ఇంద్రుడు గట్టిగా కూయడంతో గౌతముడు తెల్లారిందనుకుని సూర్యభగవానుని అర్ఘ్యం ఇచ్చేందుకు బయటకు వెళతాడు.
అయితే పవిత్ర జలం కోసం నది వద్దకు వెళ్లగానే గౌతమునికి తెల్లవారలేదని అర్థమవుతుంది. వెంటనే తిరిగి ఆశ్రమానికి వెళ్లగా.. తన రూపంలో వున్న దేవేంద్రుడు అహల్యతో కలిసి వుండడాన్ని చూస్తాడు. దీంతో గౌతమునికి పట్టరాని కోపం వస్తుంది. దేవేంద్రుడు అమరలోకానికి పరుగందుకుంటాడు. ఇంద్రుని పక్కనే ఉన్నందున అహల్యను రాయిగా మారిపోవాలని గౌతముడు శపిస్తాడు. ఆ తరువాత గౌతమ మహర్షి తన దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుని పశ్చాత్తాపంతో రాయిగా ఉన్న నువ్వు శ్రీరాముడి పాదాలు తాకినప్పుడు స్త్రీ రూపం పొందుతావని శాప విమోచనాన్ని ప్రసాదిస్తాడు. అలా రాయిలా మారిన అహల్య.. రాముని పాద స్పర్హతో పునీతురాలై స్త్రీ రూపాన్ని పొందుతుంది.