లలితాసహస్రంలో భండాసుర వధ చాలా ప్రముఖంగా వినిపిస్తుంది. శివుని తపస్సుని భగ్నం చేసే ప్రయత్నంలో మన్మధుడు కాలిబూడిదైపోయిన కథ తెలిసిందే ఆ భస్మం నుంచి వెలువడినవాడే భండాసురుడు. ముల్లోకాల మీదా యుద్ధాన్ని ప్రకటించి వణికించిన ఆ భండాసురుడు అమ్మవారి చేతిలో హతం కాక తప్పలేదు. మన్మధుని అవశేషం అయిన భండాసురుని ఇహపరమైన కోరికలకు ప్రతీకగా భావించవచ్చు. అమ్మవారి అనుగ్రహంతో ఆ కోరికను జయించి మోక్షాన్ని సాధించగలమన ఈ స్తోత్రం గుర్తుచేస్తోంది. లలితా సహస్ర నామాన్ని చదవాలంటే కొందరు ధ్యానమ్, అంగన్యాసమ్, కరన్యాసమ్, పంచపూజ, ఉత్తరభాగాలను కూడా చదువుతారు. కుదరని పక్షంగా కేవలం సహస్రనామస్తోత్రం వరకూ పఠించినా సరిపోతుంది.
ఇక హోమంగానూ, అర్చనగానూ, పారాయణగానూ భక్తులు తమ అభీష్టాన్ని అనుసరించి ఈ స్తోత్రాన్ని పఠించగలగడం మరో ప్రత్యేకత. సాధారణంగా ఏదన్నా సహస్రనామంలో ఒకేతరహా ఆరాధనకు ప్రాధాన్యత ఉంటుంది. కానీ లలితాసహస్రంలో సగుణ ఆరాధన, నిర్గుణ ఆరాధన, త్రిమూర్తుల ఉపాసన, కుండలినీ జాగృతి ఇలా అన్ని రకాల మార్గాలూ కనిపిస్తాయి. అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు సాక్షాత్తు దేవతలే ఈ సహస్రనామాలను పఠించేవారట. ఆ నామాలను హయగ్రీవుడు, అగస్త్యునికి బోధించగా వాటిని వ్యాసుడు బ్రహ్మాండపురాణంలో పొందుపరిచాడు. వ్యాసుని మనం ఆదిగురువుగా భావిస్తాము. ఇక విష్ణుమూర్తికి జ్ఞానస్వరూపమే హయగ్రీవుడు.లలిత సహస్రనామం చివరలో ‘శ్రీలలితా రహస్యనామసాహస్ర స్తోత్ర’మని పేర్కొంటారు.