ప్రదక్షిణలనేవి రెండు రకాలు. ఒకటి ఆత్మప్రదక్షిణ అయితే రెండవది.. గుడికెళ్లిన వారు చేసే ప్రదక్షిణ. ఆలయానికి వెళ్లిన వెంటనే మనం ప్రదక్షిణలు చేస్తుంటాం. ప్రదక్షిణ పూర్తయిన తర్వాతే దేవుడిని పూజించుకుంటాం. గుడికి వెళ్లిన ప్రతి ఒక్కరం ప్రదక్షిణ అయితే చేస్తాం కానీ.. ఎందుకు చేస్తామనేది మాత్రం చాలా మందికి తెలియదు. ‘ప్రదక్షిణం’లో ‘ప్ర’ అనే అక్షరము పాపాలకి నాశనము. ‘ద’ అనగా కోరికలు తీర్చమని, ‘క్షి’ అనే అక్షరము మరుజన్మలో మంచి జన్మ ఇవ్వమని. ‘ణ’ అనగా అజ్ఞానము పారద్రోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని. గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణము లో ఇంత అర్ధం ఉంది.
పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీపరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. అంతెందుకు.. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతోంది. ఒక్క గంట భూమి ప్రదక్షిణ చేయడం ఆపితే ఏం జరుగుతుందనేది ఊహించలేం. భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణ.. ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. మొత్తంగా ప్రదక్షిణ అంటే.. ‘నేను అన్ని వైపులా నుంచి నిన్నే అనుసరిస్తూ ద్యానిస్తున్నా’ అని భగవంతునికి చెప్పడం. దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆలయంలో ప్రదక్షిణ ధ్వజస్తంభంతో కలిపి చేయాలి. అప్పుడే ప్రదక్షిణ పూర్తయినట్లు లెక్క. అసలు దేవాలయంలోనికి ప్రవేశించగానే ధ్వజస్తంభానికి సాష్టాంగ నమస్కారం చేయాలి.