అసలు అఘాసురుడు ఎవరు? అతనికున్న శాపమేంటి?

తన సోదరులను హతమార్చాడని చిన్ని కృష్ణుడిని చంపాలని వెళ్లి ఆయన చేతిలోనే హతమైన అఘాసురుడు ఎవరు? ఎందుకలా కృష్ణుడి చేతిలో హతమయ్యాడు? అంటే దీనికో కథ ఉంది. కృష్ణయ్యను చంపాలని వెళ్లిన అఘుడు కొండ చిలువగా మారడంతో గుహలాంటి దాని గొంతులోకి వెళ్లిన చిన్ని కృష్ణుడు తన శరీరాన్ని పెద్దగా చేయడంతో ఊపిరాడక దాని తల పగిలింది. అయితే ఈ అఘుడు ఎవరు? అతనికి ఉన్న శాపం ఏంటి? అఘుడు పూర్వం శంఖుడనే రాక్షసుని కుమారుడు. బలంలో కానీ రూప లావణ్యాలలో కానీ అద్భుతంగా ఉండేవాడు.

అవే అఘుడిని గర్విష్టిగా మార్చేశాయి. ఈ క్రమంలోనే మలయాద్రిపై తపస్సు చేసుకుంటున్న అష్టావక్రుడిని చూసి వంకర టింకరగా ఉన్నాడంటూ అపహాస్యం చేసి అఘుడు నవ్వాడు. దానిని గ్రహించిన అష్టావక్రుడు ఆగ్రహంతో నువ్వు సర్ప రూపం ధరిస్తావని శపించాడు. ఆ వెంటనే తన తప్పు తెలుసుకున్న అఘుడు.. అష్టావక్రుడి పాదాలపై పడి మన్నించమని కోరాడు. పశ్చాత్తాపంతో ఉన్న అఘుని చూసి జాతిలో శ్రీ కృష్ణుడు నీలో ప్రవేశిస్తాడని.. అప్పుడు శాపవిముక్తి కలుగుతుందని అష్టావక్రుడు చెబుతాడు. అప్పటి నుంచి శ్రీకృష్ణుడు ఎప్పుడు కనిపిస్తాడా? తనకు శాపవిముక్తి ఎప్పుడు కలుగుతుందా? అని చూశాడు. అలా బృందావనం చేరుకుని శాపవిముక్తి పొందాడు.

Share this post with your friends