తెలంగాణ రాష్ట్రంలో కొలువైన అత్యంత పురాతన ఆలయాల్లో శ్రీ కురుమూర్తి క్షేత్రం కూడా ఒకటి. ఇక్కడి ఆలయంలో వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు ప్రజలకు లక్ష్మీ సమేతంగా స్వయంభువుగా వెలిసిన వేంకటేశ్వరస్వామి ఇష్టదైవంగా అలరారుతున్నారు. స్వామివారికి ముక్కర వంశ రాజులు దాదాపు 800 ఏళ్ల పాటు పూజలు నిర్వహించారట. ఈ ఆలయానికి ఒక కథ ఉంది. కుబేరుడి అప్పు తీర్చలేక వేంకటేశ్వర స్వామి వారు తిరుమల వీడి కృష్ణా తీరంలో కాసేపు సేద తీరారట. ఆయనకు కృష్ణమ్మ పాదాలు కందకుండా పాదుకలను బహూకరించిందట.
ఈ పాదుకలను ఇప్పటికీ ఉద్దాల ఉత్సవంలో ఊరేగిస్తారని చెబుతుంటారు. నాడు వేంకటేశ్వరస్వామి కృష్ణానదిలో సేదతీరిన ప్రదేశం నేడు ఆత్మకూరు ప్రదేశంలో గుండాల జలాశయంగా ప్రసిద్ధి చెందింది. కురుమూర్తి క్షేత్రం తిరుపతి కురుమతిగా పేరొందుతూ పేదల తిరుపతిగా అలరారుతోంది. తిరుమల వేంకటేశ్వరస్వామి వారి ఆలయానికి ఇక్కడి ఆలయంతో చాలా పోలికలున్నాయి. తిరుపతిలో వెంకటేశ్వరస్వామి ఏడు కొండల మధ్య వెలిస్తే ఇక్కడ కూడా ఏడు కొండల మధ్య స్వామి కొలువయ్యారు. ఇక్కడి స్వామివారు కూడా తిరుమల వెంకన్నను పోలి ఉంటారు. ఇక్కడి విగ్రహం కూడా నిలుచున్న భంగిమలోనే ఉంటుంది. తిరుమలకు మెట్లపై వెళ్ళేటప్పుడు శ్రీపాద చిహ్నాలు ఉన్నట్లుగానే ఇక్కడా ఉన్నాయి.