తమిళనాడులోని మధురైకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అళగర్ కోవెలలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి రూపంలో ఉండే తిరుమాళ్ స్వామివారు ఉంటారని తెలుసుకున్నాం. స్వామివారి గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు.. స్వచ్ఛమైన బంగారంతో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని చేశారు. ఆలయంలోని రథ మండపం, కళ్యాణ మండపం, వసంత మండపం, అలంకార మండపం వంటి స్వామివారి మండపాలన్నీ చూపరులను కట్టిపడేస్తాయి. ఇక ఈ ఆలయంలో ప్రత్యేకంగా తెలుసుకోవల్సినది కరుప్పు స్వామి గురించి. ఆయన ఆలయం కూడా అళగర్ కోవెల ప్రాంగణంలో ఉంది. ఇంతకీ ఎవరీ కరుప్పు స్వామి అంటారా?
కరుప్పు స్వామి చాలా శక్తివంతమైన స్వామి అని అంటారు. ఆయన ఉగ్ర రూపాన్ని సామాన్యులు చూసి తట్టుకోవడం చాలా కష్టమట. అళగర్ స్వామివారు ఉత్సవ విగ్రహం స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసినది కాబట్టి ఆ విగ్రహంపై అప్పట్లో దొంగలు కన్నేశారట. ఈ క్రమంలోనే 18 మంది దొంగలు ఆలయంపై దాడి చేశారట. పూజారులు ఈ దాడిని ముందుగానే ఊహించారట. అంతే దొంగలపై తిరగబడి చితక్కొట్టారట. అప్పుడు కరుప్పు స్వామి ప్రత్యక్షమై ఇక మీదట కావలి బాద్యతలు తాను తీసుకుంటానని చెప్పారట. నాటి నుంచి అళగర్ కోవెల రక్షకుడిగా కరుప్పు స్వామి ఉన్నారు. అయితే కరుప్పుస్వామి ఆలయాన్ని ఏడాడిలో ఒక్కసారి మాత్రమే తెరుస్తారట. కరుప్పుస్వామి ఆలయ తలుపులు తెరవగానే పక్షులే కాదు.. క్రిమికీటకాలు సైతం నిశ్శబ్దం వహిస్తాయట. చివరకు గాలి కూడా వీచడం మానేస్తుందట. ఆ ప్రాంతమంతా చిన్నపాటి శబ్దం కూడా లేకుండా సైలెంట్ అయిపోతుందట.