మిథున సంక్రాంతి అంటే సూర్యుడు వృషభం నుంచి మిథున రాశిలోకి వెళ్లే సందర్భంగా జరుపుకుంటూ ఉంటాం. దక్షిణ భారతదేశంలో మిథున సంక్రమణం అని పిలుస్తారు. హిందువులకు అత్యంత పవిత్రమైన దినాల్లో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా దీనిని ఒరిస్సా ప్రజలు పెద్ద పండుగగా జరుపుకుంటారు. నాలుగు రోజుల పాటు ఈ పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఉంటారు. ఈ నాలుగు రోజుల పాటు ఆసక్తికరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఒడిశా అంతటా దీనిని రాజా పర్బ అని పిలుస్తారు. ఈ రోజు నుంచి వ్యవసాయ సంవత్సరం ప్రారంభంగా భావిస్తూ ఉంటారు.
ఈ ఏడాది జేష్ట్య మాసంలో జూన్ 13న మిథున సంక్రాంతి రానుంది. ఈ రోజున సూర్య భగవానుడికి ప్రార్థనలు చేస్తారు. హరిద్వార్, రిషికేష్ తదితర ప్రదేశాలను సందర్శించి అక్కడ పవిత్ర గంగలో స్నానమాచరించి సూర్యుడికి అర్ఘ్యమిస్తారు. గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తే పూర్వజన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయని నమ్మకం. ఆపై మకర సంక్రాంతి సందర్భంగా దానధర్మాలు నిర్వహిస్తే మంచిదని చెబుతారు. పేదవారికి బట్టలు ఇవ్వడం, ఆహారం, బట్టలు అందించడం వంటివి చేస్తుంటారు. ఇలా చేస్తే సంతోషంతో పాటు ఆర్థికంగానూ చాలా బాగుంటుందని పండితులు చెబుతారు.