నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి. వాటిని పూజించడానికి ఒక లెక్క ఉంటుంది. ఎలా పడితే అలా చేయకూడదు. అందుకే అంతా నవగ్రహాలకు పూజ చేయాలంటే భయపడుతూ ఉంటారు. నవగ్రహాల చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? నవ గ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలి? అసలు నవగ్రహాల మండపంలోకి ఎవరిని చూస్తూ అడుగు పెట్టాలి? వంటివన్నీ తెలిసి ఉండాలి. పద్ధతి ప్రకారం చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది. మనిషి జీవితం, మానసిక ప్రశాంతత అన్నీ నవగ్రహాల స్థితిగతులపైనే ఆధారపడి ఉంటాయని నమ్మకం. కాబట్టి నవగ్రహాల విషయంలో చాలా జాగ్రత్తగానే వ్యవహరించాలి.
చక్కగా తల స్నానం చేసి ఆలయానికి వెళ్లాలి. ముందుగా ఆ ఆలయంలోని మూలవిరాట్టును దర్శించుకోవాలి. ఆ తరువాత మాత్రమే నవగ్రహ ప్రదక్షిణకు వెళ్లాలి. ముందుగా ఆలయంలోని నవగ్రహ మండపంలోనికి సూర్యుణ్ణి చూస్తూ ప్రవేశించాలి. నవగ్రహాలను చేతితో స్పృశిస్తూ ప్రదక్షిణలు చేయకూడదు. ఇక నవగ్రహాలకు చంద్రుని వైపు నుంచి అంటే ఎడమ వైపు నుంచి కుడి వైపునకు ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు పూర్తయ్యాక తిరిగి రాహు కేతువులను పూజిస్తూ కుడి వైపు నుంచి ఎడమ వైపునకు మరో రెండు ప్రదక్షిణలు చేయాలి. అనంతరం ఒక్కొక్క గ్రహం పేరును స్మరిస్తూ చివరిగా ఒక ప్రదక్షిణ చేయాలి. అది కూడా పూర్తయ్యాక నవగ్రహాలకు వీపును చూపించకుండా వెనక్కి రావాలి.